Malaysia Airlines: ల్యాండింగ్ సమయంలో కాక్‌పిట్‌పై లేజర్ లైట్లు.. గాల్లో చక్కర్లు కొట్టిన విమానం

Malaysia Airlines: కోల్‌కతా విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే సమయంలో కాక్‌పిట్‌పై లేజర్ వెలుగులు పడటంతో మలేషియా ఎయిర్‌లైన్స్ విమాన పైలట్ దృష్టి సడలింది.

CR Reddy
Published on: 10 Aug 2026 7:17 AM IST
Malaysia Airlines
X

 Malaysia Airlines

Malaysia Airlines: కౌలాలంపూర్ నుంచి కోల్‌కతా వైపు వస్తున్న మలేషియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన MH-184 విమానం ల్యాండింగ్ సమయంలో ఒక పెద్ద ప్రమాదం నుంచి తృటిలో బయటపడింది. రన్‌వేపై ల్యాండ్ కావడానికి కొన్ని నిమిషాల ముందు విమాన కాక్‌పిట్‌పై ఉన్నపళంగా ఒక శక్తివంతమైన లేజర్ బీమ్ పడింది. ఈ హఠాత్ కాంతి వెలుగుల వల్ల పైలట్ దృష్టి క్షణకాలంలో సడలింది. ప్రమాదాన్ని పసిగట్టిన పైలట్ వెంటనే ల్యాండింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసి, విమానాన్ని గాల్లోనే తిరిగి చక్కర్లు కొట్టించాడు. కొద్దిసేపటి తర్వాత పరిస్థితిని చక్కదిద్దుకుని విమానాన్ని క్షేమంగా రన్‌వేపై దింపారు. దీంతో విమానంలో ఉన్న 159 మంది ప్రయాణికులు, క్రూ సిబ్బంది సురక్షితంగా బయటపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

సమాచారం ప్రకారం శనివారం రాత్రి 11:20 గంటలకు ఈ విమానం కోల్‌కతాలో ల్యాండ్ కావాల్సి ఉంది. విమానం రన్‌వేకు సుమారు ఎనిమిది నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న సమయంలో మధ్యమగ్రామ్-బారాసాత్ వైపు నుంచి కాక్‌పిట్ వైపు తీవ్రమైన లేజర్ లైట్ పడినట్లు పైలట్ గమనించాడు. అనూహ్యంగా పైలట్ కళ్లపై ఈ కాంతి పడటంతో విమానాన్ని సురక్షితంగా దింపడం కష్టంగా మారింది. దీనితో పైలట్ సమయస్ఫూర్తితో వ్యవహరించి విమానాన్ని మళ్లీ గాల్లోకి తీసుకెళ్లి, రెండో ప్రయత్నంలో క్షేమంగా ల్యాండ్ చేశాడు. ఈ ఘటనపై విమానయాన అధికారులు, ఎయిర్‌పోర్ట్ అథారిటీ నివేదిక కోరారు.

దేశంలో విమానాల సాంకేతిక లోపాలపై పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) ఆందోళనకర గణాంకాలను వెల్లడించింది. గత ఏడాది విమానాల్లో ఏకంగా 889 తీవ్రమైన సాంకేతిక లోపాలు నమోదయ్యాయి. 2024లో ఈ సంఖ్య 692గా ఉండగా, 2023లో 487, 2022లో 528గా నమోదైనట్లు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ ఇటీవల లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ద్వారా వెల్లడించారు. ఈ గణాంకాలు విమానయాన భద్రతపై కఠినమైన తనిఖీల ఆవశ్యకతను స్పష్టం చేస్తున్నాయి.

ఇదిలా ఉంటే, మహారాష్ట్రలోని బారామతి ఎయిర్‌ఫీల్డ్‌లో ఆదివారం మధ్యాహ్నం శిక్షణ సమయంలో మరొక విమాన ప్రమాదం తృప్తిగా తప్పింది. ప్రాక్టీస్ రన్ చేస్తున్న సెస్నా సి 172 అనే శిక్షణ విమానం కంట్రోల్ తప్పి రన్‌వే బయటకు దూసుకెళ్లింది. ఆ సమయంలో విమానంలో ఒక ఫ్లైట్ ఇన్‌స్ట్రక్టర్, ఒక ట్రైనీ పైలట్ ఉన్నారు. అదృష్టవశాత్తూ వీరిద్దరికీ ఎలాంటి గాయాలు కాలేదని, పూర్తిగా సురక్షితంగా బయటపడ్డారని డీజీసీఏ స్పష్టం చేసింది. టేకాఫ్, క్యాన్సిలేషన్ శిక్షణ చేస్తున్న సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story