జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. మోస్ట్ వాంటెడ్ లష్కరే కమాండర్ యాసిర్ హతం
జమ్మూకశ్మీర్‌లోని యూస్‌మార్గ్‌లో భద్రతా బలగాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తయ్యిబా కమాండర్ యాసిర్ హతమయ్యాడు.
జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. మోస్ట్ వాంటెడ్ లష్కరే కమాండర్ యాసిర్ హతం
పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తయ్యిబాకు చెందిన మోస్ట్ వాంటెడ్ కమాండర్ యాసిర్‌ను జమ్మూకశ్మీర్‌లోని యూస్‌మార్గ్ పర్వత ప్రాంతంలో భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. గత కొంతకాలంగా యాసిర్ కదలికలపై నిఘా ఉంచిన బలగాలు, శుక్రవారం చేపట్టిన ఆపరేషన్‌లో ఇరువర్గాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో అతడిని హతమార్చినట్లు పోలీసులు శనివారం వెల్లడించారు. పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులతోనూ ఇతనికి సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
యాసిర్ గతంలో లష్కరే తయ్యిబా ఉగ్రముఠాలో సభ్యుడిగా ఉండి, ఆ తర్వాత స్వతంత్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నాడు. 2024 మే నెలలో పూంఛ్‌లో భారత వైమానిక దళ (IAF) కాన్వాయ్‌పై దాడి, అదే ఏడాది అక్టోబర్‌లో సోనామార్గ్ దగ్గర కార్మికులపై దాడి, డిసెంబర్‌లో బోటా పత్రిలో సైన్యంపై జరిగిన దాడి వంటి పలు తీవ్రమైన ఘటనల్లో ఇతని ప్రమేయం ఉన్నట్లు తేలింది. పూంఛ్ నుంచి యూస్‌మార్గ్ మీదుగా పుల్వామా వైపు ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయన్న పక్కా సమాచారంతో వారం రోజులుగా మాటువేసిన భద్రతా బలగాలు ఈ ఆపరేషన్ చేపట్టాయి. ప్రస్తుతం యాసిర్‌తో పాటు ఉన్న మిగతా ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.




