Farmer Wife: నాగలికి భార్యను కట్టి పొలం దున్నిన రైతు.. గుండెల్ని పిండేస్తున్న అన్నదాత కష్టం

Farmer Wife: మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో పిడుగుపాటుకు ఎద్దు చనిపోవడంతో, ఒక రైతు భార్య తానే ఎద్దు స్థానంలో నిలబడి నాగలి లాగింది.

Naresh.k
Published on: 11 Jun 2026 12:16 PM IST
Farmer Wife
X

Farmer Wife: నాగలికి భార్యను కట్టి పొలం దున్నిన రైతు.. గుండెల్ని పిండేస్తున్న అన్నదాత కష్టం

Maharashtra Farmer: దేశానికి అన్నం పెట్టే రైతు ఇల్లు.. ఆకలితో అలమటించకూడదని ఆ ఇల్లాలు ఏం చేసిందో తెలుసా? నాగలికి ఒకవైపు ఎద్దు ఉంటే.. మరోవైపు తనే ఎద్దుగా మారి కాడిని భుజాన వేసుకుంది! మహారాష్ట్ర నుంచి వచ్చిన ఈ హృదయ విదారక దృశ్యం ఇప్పుడు దేశాన్నే కదిలిస్తోంది. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా బంబాలి గ్రామానికి చెందిన కాశీనాథ్ గైక్వాడ్ అనే ఒక సాధారణ పేద రైతు కథ ఇది. ఖరీఫ్ సీజన్ మొదలైంది.. ఆకాశం వైపు చూస్తూ, ఎప్పుడెప్పుడు విత్తనాలు వేద్దామా అని ఆ అన్నదాత ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నాడు. తీరా సమయం వచ్చాక విధి అతడిని ఘోరంగా వంచించింది. అకస్మాత్తుగా పడిన పిడుగుపాటుకు గురై అతనికున్న ఒకే ఒక్క ఎద్దు ప్రాణాలు కోల్పోయింది. రెక్కాడితే గానీ డొక్కాడని ఆ పేద కుటుంబానికి ఒకేసారి కొండంత కష్టం వచ్చి పడింది. మార్కెట్‌కెళ్లి కొత్త ఎద్దును కొనే ఆర్థిక స్తోమత ఆ కుటుంబానికి లేదు. అటు చూస్తే విత్తనాలు వేసే సమయం మించిపోతోంది.. రోజురోజుకూ పొలం ఎండిపోతోంది.

చేసేదేమీ లేక, ఆ అన్నదాత తన నాగలికి ఒక వైపు ఉన్న ఒక్క ఎద్దును కట్టాడు. అయితే, ఒంటి ఎద్దుతో పొలం దున్నడం అసాధ్యం. అప్పుడే ఆ ఇంట్లోని ఇల్లాలు ఒక సాహసోపేతమైన, కన్నీరు పెట్టించే నిర్ణయం తీసుకుంది. తన భర్త పడుతున్న కష్టాన్ని చూడలేక.. ఈ టైమ్‌లో విత్తనం మొలకెత్తకపోతే ఏడాది పొడవునా కుటుంబం ఆకలితో రోడ్డున పడుతుందని గ్రహించింది. ఎద్దు స్థానంలో తానే నిలబడింది. నాగలి కాడిని తన భుజాలపై వేసుకుంది. భర్త నాగలి పడుతుంటే.. ఆ ఇల్లాలు ఎద్దుతో సమానంగా అడుగులు వేస్తూ, కాడిని ముందుకు లాగుతూ పొలాన్ని దున్నింది. పొలం గట్లపై నిలబడి చూసిన స్థానికులు కన్నీరు మున్నీరయ్యారు. ఒక ఆడబిడ్డ కడుపు కూటి కోసం, భర్తకు తోడుగా అంత కష్టాన్ని భుజానకెత్తుకోవడం అందరినీ కలచివేసింది.

ఈ హృదయ విదారక దృశ్యాలు సోషల్ మీడియాలో వీడియో రూపంలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. పాలకులపై, అధికారులపై నెట్టింట తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. డిజిటల్ ఇండియా, సూపర్ పవర్ అని గొప్పలు చెప్పుకునే దేశంలో.. రైతు ఇల్లాలు నాగలి లాగాల్సి రావడం సిగ్గుచేటు అని ఒకరు కామెంట్ చేశారు.ఎన్నికల ప్రచారాలకు కోట్లు ఖర్చు పెట్టే నాయకులకు.. ఈ అన్నదాత కష్టం, ఆ తల్లి ఆవేదన కనిపించడం లేదా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యానికి గురైన ఈ రైతును ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి, సదరు కుటుంబానికి కొత్త ఎద్దును లేదా ట్రాక్టర్‌ను అందించి ఆదుకోవాలి అని దేశవ్యాప్తంగా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ దృశ్యం కేవలం ఒక లాతూర్ జిల్లా రైతు కథ మాత్రమే కాదు.. దేశంలో నేటికీ సరైన మద్దతు లేక అల్లాడుతున్న లక్షలాది మంది అన్నదాతల దైన్య స్థితికి అద్దం పడుతోంది. ఇప్పటికైనా పాలకులు స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకుంటారో లేదో చూడాలి.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story