EC Notice: ఢిల్లీలో కలకలం.. సీఎం రేఖా గుప్తా, కేజ్రీవాల్ సహా ప్రముఖులకు నోటీసులు
EC Notice: దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాల్లో SIR ప్రక్రియ తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
EC Notice
EC Notice: దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాల్లో SIR ప్రక్రియ తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఢిల్లీ ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ఓటర్ జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఏకంగా ముఖ్యమంత్రి రేఖా గుప్తా, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ప్రముఖ న్యాయవాది, రాజకీయ నాయకుడు కపిల్ సిబల్, బీజేపీ నేత వీంద్రేంద్ర సచ్‌దేవా వంటి దిగ్గజ ప్రముఖులకు నోటీసులు జారీ అయ్యాయి. ఓటర్ల ఎన్యుమరేషన్ ఫారాల్లో తలెత్తిన కొన్ని చిన్నపాటి లోపాలు, పాత రికార్డులు సరిపోలకపోవడం వంటి కారణాల వల్ల ఈ నోటీసులు ఇవ్వడం గమనార్హం.
అయితే ఈ జాబితాలో పేరున్న ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు సంబంధించిన వయసు వివాదాన్ని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఆమె సమర్పించిన వివరణను పరిగణలోకి తీసుకున్న ఎన్నికల సంఘం, సీఎం రేఖా గుప్తా ఎంట్రీని అధికారికంగా వాలీడ్ చేసింది. దీంతో ఆమె పేరు రాబోయే నవంబర్ 4న ప్రచురించబడే షాలిమార్ బాగ్ నియోజకవర్గ తుది ఓటర్ జాబితాలో అధికారికంగా చేర్చనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆయన కుటుంబ సభ్యులైన సునీతా కేజ్రీవాల్, తల్లిదండ్రులు, కుమారుడికి సంబంధించిన పాత ఎస్ఐఆర్ వివరాలు దొరకకపోవడంతో వారికి కూడా నోటీసులు అందినట్లు సమాచారం.
కేవలం కొద్దిమంది ప్రముఖులే కాకుండా, ఢిల్లీ వ్యాప్తంగా డ్రాఫ్ట్ లిస్ట్ ప్రచురించిన తర్వాత వివరాల్లో తేడాలున్న దాదాపు 33.13 లక్షలకు పైగా ఓటర్లకు ఎన్నికల సంఘం ఈ నోటీసులు జారీ చేసింది. బీజేపీ నేత వీరేంద్ర సచ్‌దేవా, ఆయన కుటుంబ సభ్యులు, సుధాంషు మిట్టల్ వంటి ప్రముఖులకు కూడా పేర్లు, రికార్డుల్లోని తప్పుల కారణంగా నోటీసులు అందాయి. తాము తగిన పత్రాలు సమర్పించి ఈ చిన్నపాటి లోపాలను సరిదిద్దుకుంటామని వీరేంద్ర సచ్‌దేవా తెలిపారు. మరోవైపు అధికార, ప్రతిపక్ష నాయకుల ఓట్లు గల్లంతు కావడం లేదా నోటీసులు రావడంతో రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున విమర్శలు, ప్రతివిమర్శలు చెలరేగుతున్నాయి.
ఎన్నికల సంఘం మాత్రం ఓటర్ జాబితాను అత్యంత పారదర్శకంగా, ఎలాంటి తప్పులు లేకుండా సరిదిద్దేందుకే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్లు చెబుతోంది. సరైన ధ్రువీకరణ పత్రాలు మరియు సరైన సమాచారం అందించిన ప్రతి ఒక్కరి పేరును తుది జాబితాలో పక్కాగా చేర్చుతామని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఏదేమైనా సాధారణ ప్రజలతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి, మాజీ సీఎంలకే నోటీసులు రావడంతో ఢిల్లీలో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది.




