Chandrapur: కోతిని వేటాడుతూ విద్యుదాఘాతంతో చిరుత మృతి!
Chandrapur: మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలో కోతిని వెంబడిస్తూ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కిన చిరుత విద్యుదాఘాతంతో మృతి. అటవీశాఖ అధికారుల వెల్లడి.
Chandrapur: కోతిని వేటాడుతూ విద్యుదాఘాతంతో చిరుత మృతి!
Chandrapur: కోతిని వేటాడేందుకు వెళ్లిన ఓ చిరుతకు అదే చివరి వేటగా మారింది. వానరాన్ని వెంటాడుతూ ట్రాన్స్‌ఫార్మర్ స్తంభాలపైకి ఎక్కిన చిరుత విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన ఘటన మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా చిమూర్ తాలూకాలో చోటుచేసుకుంది.
చిమూర్ తాలూకాలోని శంకరాపూర్ గ్రామ పరిసరాల్లో సుమారు ఐదేళ్ల వయసున్న ఆడ చిరుత కోతిని వేటాడే క్రమంలో గ్రామ సమీపంలోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ వద్దకు చేరుకుంది. వానరాన్ని వెంటాడుతూ ట్రాన్స్‌ఫార్మర్ స్తంభాలపైకి ఎక్కిన సమయంలో విద్యుత్ తీగలను తాకడంతో ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురైంది. దీంతో చిరుత అక్కడికక్కడే మృతి చెందింది.
సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని చిరుత కళేబరాన్ని చిమూర్ అటవీ క్షేత్రానికి తరలించారు. అక్కడ పశువైద్యుల ఆధ్వర్యంలో శవపరీక్ష నిర్వహించిన అనంతరం అటవీశాఖ నిబంధనల ప్రకారం చిరుతను ఖననం చేశారు.




