LeT Commander Latif Bhat: కూలీ వేషంలో తప్పించుకున్నాడు.. చివరకు సైన్యం వేటలో చిక్కాడు!
LeT Commander Latif Bhat: జమ్మూకశ్మీర్‌లో చిట్టచివరి స్థానిక ఉగ్రవాదిగా భావిస్తున్న లష్కరే తయ్యిబా (LeT) కమాండర్ లతీఫ్ భట్‌ను భారత భద్రతా దళాలు మట్టుబెట్టాయి.
LeT Commander Latif Bhat: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద ఏరివేతలో భారత భద్రతా దళాలు భారీ విజయాన్ని సాధించాయి. లోయలో చిట్టచివరి స్థానిక ఉగ్రవాదిగా భావిస్తున్న లష్కరే తయ్యిబా (LeT) కమాండర్ లతీఫ్ భట్ ను సైన్యం, సీఆర్పీఎఫ్ దళాలు సంయుక్త ఆపరేషన్‌లో మట్టుబెట్టాయి. ఇటీవల సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన కాల్పుల ఘటన తర్వాత అతడి కోసం వేటను తీవ్రతరం చేసిన భద్రతా దళాలు, ఎట్టకేలకు కుల్గాం జిల్లాలో అతడి కథ ముగించాయి. రూ.15 లక్షల రివార్డ్ ఉన్న లతీఫ్ భట్ హతమవ్వడంతో కశ్మీర్ లోయలో స్థానిక ఉగ్రవాదానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
సోమవారం కుల్గాంలోని లారూ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉమర్ నసీర్ దార్ అనే ఉగ్రవాదిని దళాలు మట్టుబెట్టగా, లతీఫ్ భట్ బుల్లెట్ గాయాలతో తప్పించుకున్నాడు. అతడి కోసం గాలింపు ముమ్మరం చేసిన భద్రతా దళాలు మంగళవారం అర్ధరాత్రి దాటాక అతడి ఆచూకీని పసిగట్టి చుట్టుముట్టాయి.
ఈ క్రమంలో భద్రతా దళాల అధికారులు లతీఫ్ భట్‌కు వీడియోకాల్ చేసి లొంగిపోవాలని కోరారు. ప్రాణహాని తలపెట్టమని నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా, లతీఫ్ అందుకు ససేమిరా అన్నాడు.
అతడు లొంగిపోవడానికి నిరాకరించడంతో తెల్లవారుజామున ఇరు పక్షాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. గంటలసేపు శ్రమించిన దళాలు, ఓ ప్రార్థనా మందిరంలో నక్కిన లతీఫ్‌ను మట్టుబెట్టాయి.
నవంబర్ 11న సీఆర్పీఎఫ్ దళాలపై దాడి చేయడానికి ముందు లతీఫ్ కుల్గాంలో పలుమార్లు రెక్కీ నిర్వహించినట్లు సీసీటీవీ దృశ్యాల్లో వెల్లడైంది. నవంబర్ 10న అతడు మీర్ బజార్, అక్రాన్ హబ్లిస్, కిలామ్ ప్రాంతాల్లో సంచరించినట్లు గుర్తించారు. నవంబర్ 11 నాటి దాడిలో అతడు వాడిన తుపాకీ, గతంలో దాడులకు ఉపయోగించిన ఆయుధం ఒకటేనని భద్రతా దళాలు నిర్ధారించాయి.
అంతేకాకుండా, ఈ దాడిలో భద్రతా సిబ్బంది రక్షణ కవచాలను సైతం ఛేదించే ఆర్మర్ పియర్సింగ్ తూటాలను అతడు వినియోగించినట్లు తేలింది. ఘటనా స్థలంలో లభించిన ఓ ఫోన్ ఆధారంగా లతీఫ్‌కు ఆశ్రయం కల్పించిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు ఆచూకీ బయటపడింది.
పోలీసులు, భద్రతా దళాలపై దాడులు చేసి పారిపోవడంలో లతీఫ్ భట్ దిట్టగా పేరుపొందాడు. గతంలో షోపియాన్‌లో కొన్ని రోజుల పాటు సాగిన ఎన్‌కౌంటర్ నుంచి అతడు చాకచక్యంగా తప్పించుకున్నాడు. అనంత్‌నాగ్‌లో ఓ పోలీసు కానిస్టేబుల్ హత్య, కుల్గాంలో ఇద్దరు వలస కార్మికుల హత్య కేసుల్లో ఇతడి ప్రమేయం ఉంది.
ఈ ఏడాది జులైలో జరిగిన అనంత్‌నాగ్ దాడి తర్వాత, కూలీలు వాడే గోనెసంచిలో ఆటోమేటిక్ ఆయుధాన్ని దాచిపెట్టి, సాధారణ కూలీ వేషంలో ఓ ప్యాసింజర్ బస్సు ఎక్కి పోలీసుల కళ్లుగప్పి పారిపోయాడు. ఎట్టకేలకు భద్రతా దళాల పక్కా వ్యూహంతో ఈ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హతమయ్యాడు.




