LPG Crisis: దేశవ్యాప్తంగా గ్యాస్ సిలెండర్ల గందరగోళం.. సిలెండర్లు ఎత్తుకుపోతున్నారు

LPG Crisis: మధ్యప్రాచ్యంలో యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో దేశవ్యాప్తంగా గ్యాస్ సిలెండర్ల కోసం గందరగోళం నెలకొంది. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే..

KVD Varma
Published on: 13 March 2026 6:54 PM IST
LPG Crisis: మధ్యప్రాచ్యంలో యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
X

LPG Crisis

LPG Crisis: మధ్య ప్రాచ్యంలో యుద్ధం.. మన దేశంలో వంట గ్యాస్ కు మంటలు పెట్టింది. రోజురోజుకూ గ్యాస్ సిలెండర్ల కోసం దేశవ్యాప్తంగా డిమాండ్ పెరిగిపోవడంతో పాటు.. సరఫరా లేకపోవడంతో తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడుడుతున్నాయి. దాదాపుగా ప్రతి రాష్ట్రంలోనూ వంట గ్యాస్ కోసం విపరీతమైన పోటీ ఏర్పడిన పరిస్థితి కనిపిస్తోందని వార్తలు వస్తున్నాయి. జాతీయ మీడియా వార్తల ప్రకారం చాలా చోట్లా 2 వేల రూపాయల కమర్షియల్ ఎల్ఫీజి సిలెండర్ 4 వేల రూపాయలకు అమ్ముతున్నారు. గ్యాస్ సిలెండర్ల బ్లాక్ మార్కెటింగ్ పెరిగిపోతున్నట్టు తెలుస్తోంది. గ్యాస్ సిలెండర్లను అక్రమంగా నిల్వ ఉంచుతున్న సంఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.

పంజాబ్ లో పరిస్థితి మరింత గందరగోళంగా ఉంది. బర్నాలాలోని షైనా గ్రామంలో సిలిండర్ తీసుకోవడానికి లైనులో ఉన్న భూషణ్ కుమార్ మిట్టల్ (66) అనే వ్యక్తి గుండెపోటుతో మరణించారు. అకస్మాత్తుగా కుప్పకూలిపోయే ముందు రెండు గంటల నుంచి ఆయన లైనులో తన వంతు కోసం వేచి చూస్తున్నట్టు తెలిసింది. అదేవిధంగా లూథియానాలోని శాంతి నగర్‌లో రమేష్ కుమార్ అనే వ్యక్తి నుంచి నింపిన సిలిండర్‌ను దోచుకున్నారు. షేర్‌పూర్‌లో ప్రజలు నిరసనలు చేపట్టారు. అక్కడ గ్యాస్ ఏజెన్సీ యజమాని సిలెండర్ల వ్యాన్ పంపించారు. దాని నుంచి సిలెండర్లను ఎత్తుకుని ప్రజలు పరుగులు తీశారు. ఈ సందర్భంగా వారిని అడ్డుకున్న పోలీసులతో ప్రజలు వాగ్వాదానికి దిగారు.

దాదాపుగా ఇదే పరిస్థితి.. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, కేరళ లలో కూడా నెలకొంది. ఇదిలా ఉండగా దిగజారుతున్న ఎల్ఫీజి సరఫరా పరిస్థితిపై ఢిల్లీలో కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలకు దిగారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్ సరఫరాపై క్లారిటీ ఇచ్చింది. ప్రభుత్వం తరఫున పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ మాట్లాడుతూ వంట గ్యాస్ కోసం ఇబ్బందులు ఉన్నాయన్నారు. మన దిగుమతుల్లో ఎక్కువ భాగం హార్ముజ్ జలసంధి ద్వారానే జరుగుతాయి. ప్రస్తుతం యుద్ధ కారణంగా అది మూసివేశారు. దీనివలన సరఫరాలో అంతరాయం వచ్చిందని చెప్పారు. వెల్లువెత్తుతున్న రూమర్లు.. భయాందోళనల కారణంగా ఒక్కసారిగా బుకింగ్స్ కి ప్రజలు దిగుతున్నారు. అందువల్ల ఈ సమస్య తలెత్తుతోంది. సాధారణంగా, రోజుకు 50-55 లక్షలు బుకింగ్‌లు జరిగేవి. కానీ ఇప్పుడు అవి 75-76 లక్షలకు పెరిగాయని ఆమె వివరించారు.

మొత్తమ్మీద చూసుకుంటే దేశవ్యాప్తంగా వంటగ్యాస్ మంటలు గట్టిగానే ఉన్నాయి. ఎన్నిరోజుల్లో ఇది మామూలు స్థితికి వస్తుంది అనే విషయంపై మాత్రం ఇప్పటికీ క్లారిటీ లేదు.

KVD Varma

KVD Varma

Next Story