Slum Fire : మురికివాడలో మంటల బీభత్సం.. 1200 గుడిసెలు బుడిద.. 100 సిలిండర్ల పేలుళ్లతో దద్దరిల్లిన ప్రాంతం
Slum Fire : లక్నో వికాస్ నగర్ మురికివాడలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. 1200 గుడిసెలు దగ్ధం, 100 సిలిండర్ల పేలుడు దాటికి 5కిమీ మేర పొగ వ్యాపించింది. 50 మూగజీవాల మృతి చెందాయి.
Lucknow Fire
Slum Fire : ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో బుధవారం సాయంత్రం పెను విషాదం చోటుచేసుకుంది. వికాస్ నగర్ ప్రాంతంలోని ఒక మురికివాడలో చెలరేగిన భారీ అగ్నిప్రమాదం వందలాది కుటుంబాలను రోడ్డున పడేసింది. చూస్తుండగానే మంటలు ఉవ్వెత్తున ఎగసిపడి దాదాపు 1200 గుడిసెలను బూడిద చేశాయి. ఈ ప్రమాదంలో గ్యాస్ సిలిండర్లు బాంబుల్లా పేలడంతో ఆ ప్రాంతమంతా యుద్ధ భూమిని తలపించింది. అగ్ని కీలల ధాటికి మూగజీవాలు సజీవ దహనం కాగా, వందలాది మంది నిలువ నీడ లేక ఆకాశం కిందకు చేరారు.
ప్రమాదం జరిగిన తీరు
లక్నోలోని వికాస్ నగర్ సెక్టార్-12లో రింగ్ రోడ్డు పక్కన ఉన్న అక్రమ మురికివాడలో బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో మంటలు అంటుకున్నాయి. ఒక చిన్న గుడిసెలో మొదలైన నిప్పు, గాలి తోడవడంతో క్షణాల్లోనే ఆ ప్రాంతమంతా వ్యాపించింది. ఈ అగ్ని ప్రమాద తీవ్రతకు సుమారు 1200 గుడిసెలు కాలిపోయాయి. గుడిసెల్లో ఉన్న సుమారు 100 గ్యాస్ సిలిండర్లు వరుసగా పేలడంతో ఆ ధాటికి ఐదు కిలోమీటర్ల దూరం వరకు పొగ కమ్మేసింది. భయంతో జనం రోడ్ల మీదకు పరుగులు తీశారు. రింగ్ రోడ్డుపై ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది.
ఆలస్యంగా చేరిన ఫైర్ ఇంజన్లు
అగ్నిప్రమాదంపై పోలీసులకు, ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చినా అధికారులు స్పందించడంలో జాప్యం చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రమాదం జరిగిన గంట తర్వాత గానీ ఫైర్ ఇంజన్లు చేరుకోలేదని, ఆ లోపే సర్వం కాలిపోయిందని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ జాప్యం కారణంగానే మంటలు ఇంతటి వినాశనాన్ని సృష్టించాయని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులతో స్థానికులు తీవ్రంగా వాగ్వాదానికి దిగారు.
తప్పిపోయిన చిన్నారులు
ఈ ప్రమాదంలో ఆస్తి నష్టమే కాకుండా భారీగా ప్రాణ నష్టం కూడా జరిగినట్లు తెలుస్తోంది. సుమారు 50 మేకలు, రెండు ఆవులు మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యాయి. అంతేకాకుండా, తొక్కిసలాట, భయాందోళనల నడుమ కొందరు చిన్నారులు ఆచూకీ దొరకడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు, ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు ప్రస్తుతం అక్కడ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రభుత్వ స్పందన - సహాయక చర్యలు
లక్నో ఎంపీ, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ ఘటనపై వెంటనే స్పందించారు. జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. యూపీ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ స్వయంగా సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. 22 ఫైర్ టెండర్లు రాత్రి 10 గంటల వరకు కష్టపడి మంటలను అదుపులోకి తెచ్చాయి. ముందస్తు జాగ్రత్తగా పక్కనే ఉన్న 30 పక్కా భవనాలను ఖాళీ చేయించారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇచ్చారు.




