బలపరీక్షకు ముందే విజయ్ పార్టీకి షాక్.. టీవీకే ఎమ్మెల్యేపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు!
Madras High Court: తమిళనాడు అసెంబ్లీలో విశ్వాస పరీక్షకు ముందే టీవీకే ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతికి మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది.
బలపరీక్షకు ముందే విజయ్ పార్టీకి షాక్.. టీవీకే ఎమ్మెల్యేపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు!
Madras High Court: తమిళనాడు అసెంబ్లీలో రేపు (బుధవారం) జరగనున్న విశ్వాస పరీక్షకు ముందే తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తిరుపత్తూరు నియోజకవర్గ ఫలితంపై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు వేసవి విరామ కాల ధర్మాసనం, టీవీకే ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతి ఓటు వేయకుండా స్టే విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీవీకే అభ్యర్థి శ్రీనివాస సేతుపతి, డీఎంకే సీనియర్ నేత పెరియకరుప్పన్పై కేవలం ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. అయితే, ఈ గెలుపుపై పెరియకరుప్పన్ కోర్టును ఆశ్రయించారు. తమిళనాడులో శివగంగ జిల్లాలో ఒక 'తిరుపత్తూరు', తిరుపత్తూరు జిల్లాలో మరో 'తిరుపత్తూరు' నియోజకవర్గాలు ఉన్నాయి.
శివగంగ జిల్లాలోని పోస్టల్ బ్యాలెట్లను పొరపాటున మరో జిల్లాలోని కౌంటింగ్ కేంద్రానికి పంపారని పెరియకరుప్పన్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదించారు. కేవలం ఒక్క ఓటు తేడా ఉన్నప్పుడు ఇటువంటి పొరపాట్లు అభ్యర్థి విజయాన్ని తారుమారు చేస్తాయని కోర్టుకు సాక్ష్యాధారాలు సమర్పించారు.
ఈ కేసును అత్యవసరంగా విచారించిన జస్టిస్ ఎల్. విక్టోరియా గౌరి, జస్టిస్ ఎన్. సెంథిల్ కుమార్‌ల ధర్మాసనం ఈ క్రింది ఆదేశాలు జారీ చేసింది. ఓటు హక్కుపై స్టే: మే 13న అసెంబ్లీలో జరిగే విశ్వాస పరీక్షలో శ్రీనివాస సేతుపతి పాల్గొనకూడదు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు సభలో ఓటు వేయడానికి ఆయనకు అనుమతి లేదు.
అసలే ఏఐఏడీఎంకే చీలికతో సభలో బలాబలాలు ఉత్కంఠగా మారిన వేళ, ఒక్క ఓటు తగ్గడం టీవీకే వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. కేవలం ఒక్క ఓటుతో గెలిచిన ఎమ్మెల్యేకు, ఇప్పుడు అదే ఒక్క ఓటు వివాదం శాపంగా మారడం తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆదివారం నాడు కోర్టు ప్రత్యేకంగా సమావేశమై ఈ తీర్పు ఇవ్వడం ఈ కేసు ప్రాధాన్యతను చాటుతోంది.




