Influencer Diwali Prank: స్వీట్లు పంపమంటే లారీల్లో టీవీలు, ఫ్రిజ్‌లు పంపించారు.. సోషల్ మీడియా ప్రాంక్ వైరల్!

Influencer Diwali Prank: మదురైకి చెందిన ఇన్‌స్టాగ్రామ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ దీపావళికి స్వీట్లు కోరితే.. ఆకతాయిలు క్యాష్‌ ఆన్‌ డెలివరీలో టీవీలు, ఫ్రిజ్‌లు ఆర్డర్ చేసి ప్రాంక్‌లతో చుక్కలు చూపించిన వైరల్ వార్త పూర్తి వివరాలు.

Arun Chilukuri
Published on: 13 Oct 2026 12:00 PM IST
Influencer Diwali Prank
X

Influencer Diwali Prank: స్వీట్లు పంపమంటే లారీల్లో టీవీలు, ఫ్రిజ్‌లు పంపించారు.. సోషల్ మీడియా ప్రాంక్ వైరల్!

Influencer Diwali Prank: పండగ పూట అభిమానులు తమకు ఇష్టమైన వారికి లేదా సెలబ్రిటీలకు బహుమతులు పంపడం సర్వసాధారణం. అయితే, తమిళనాడుకు చెందిన ఓ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌కు ఇదే సరదా పెద్ద తలనొప్పిగా మారింది. దీపావళికి స్వీట్లు పంపిస్తారని ఆశపడి తన అడ్రస్‌ షేర్ చేస్తే.. ఆకతాయిలు ఏకంగా లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను ‘క్యాష్‌ ఆన్‌ డెలివరీ’ (COD) ఆర్డర్లుగా పంపి చుక్కలు చూపించారు.

తమిళనాడులోని మదురైకి చెందిన వీరమణి ప్రముఖ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఇంటి చిరునామా, ఫోన్‌ నంబర్‌ను షేర్ చేస్తూ.. అభిమానులు ఎవరైనా స్వీట్లు పంపిస్తే సంతోషిస్తానని పోస్ట్ పెట్టారు.

కానీ, కొందరు నెటిజన్లు, ఆకతాయిలు దీనిని మరోలా తీసుకున్నారు. వీరమణిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఆయన పేరుపై ఖరీదైన వస్తువులను ప్రాంక్‌ ఆర్డర్లుగా బుక్ చేయడం ప్రారంభించారు. స్వీట్లు రావాల్సిన చోట.. టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు డెలివరీకి రావడం ప్రారంభించాయి.

ఓ టీవీ ధర ఏకంగా రూ.1.69 లక్షలు ఉండగా, అవన్నీ క్యాష్‌ ఆన్‌ డెలివరీ (COD) పద్ధతిలో బుక్ చేయడంతో వీరమణికి ఏం చేయాలో పాలుపోలేదు. కేవలం అరగంట వ్యవధిలోనే 15 ఆర్డర్లు వచ్చాయని, అంత పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించే సామర్థ్యం తన వద్ద లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

రూ.70 కోట్ల విలువైన టీ-90 యుద్ధ ట్యాంకు, అంబులెన్స్‌, రాకెట్‌ కూడా ఆయనకు ఆర్డర్‌ చేశారంటూ సోషల్‌ మీడియాలో అనేక మీమ్స్, పోస్టులు వైరల్‌గా మారాయి.

ఈ ప్రాంక్‌ల వల్ల కేవలం వీరమణి మాత్రమే కాకుండా, దూర ప్రాంతాల నుంచి ఎంతో కష్టపడి పార్సిళ్లు తీసుకొచ్చిన డెలివరీ సిబ్బంది సైతం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. తాను ఎలాంటి ఆర్డర్లు చేయలేదని డెలివరీ బాయ్స్‌కు నజెప్పలేక ఆయన పడిన పాట్లు అంతాఇంతా కాదు.

ఈ వేధింపులు తట్టుకోలేక వీరమణి ఇన్‌స్టాగ్రామ్‌లో వరుస వీడియోలు షేర్ చేస్తూ కన్నీటి పర్యాయమయ్యారు. "నాకెందుకు ఇలా చేస్తున్నారు? అరగంటలో 15 ఆర్డర్లు వచ్చాయి. వాటన్నింటికీ సరిపడా డబ్బు నా దగ్గర లేదు. దయచేసి ఈ ప్రాంక్‌లను ఆపండి" అంటూ వేడుకున్నారు. చివరికి ప్రాంక్‌లు ఆగకపోవడంతో విసిగిపోయిన ఆయన, ఊరు విడిచి వెళ్తున్నట్లు మరో వీడియోలో ప్రకటించారు.

సోషల్‌ మీడియాలో వ్యక్తిగత సమాచారాన్ని (చిరునామా, ఫోన్‌ నంబర్లు) పంచుకునేటప్పుడు ఎంతటి జాగ్రత్త అవసరమో ఈ ఘటన మరోసారి నిరూపించింది. పండగ పూట సరదాగా చేయాలనుకున్న ప్రాంక్‌లు.. ఎదుటివారిని ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టడమే కాకుండా, శ్రమజీవులైన డెలివరీ సిబ్బందిని సైతం రోడ్డున పడేస్తాయని ఈ ఉదంతం హెచ్చరిస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.