Mumbai: ముంబయిలో అనుమానిత జైషే ఉగ్రవాది అరెస్ట్
Mumbai: మహారాష్ట్ర ఏటీఎస్ అధికారులు ముంబయిలోని మహిమ్‌లో జైషే మహమ్మద్ అనుమానిత ఉగ్రవాది మహమ్మద్ హసన్‌ను అరెస్ట్ చేశారు.
Mumbai: ముంబయిలో అనుమానిత జైషే ఉగ్రవాది అరెస్ట్
Mumbai: మహారాష్ట్ర తీవ్రవాద నిరోధక దళం (ATS) అధికారులు ముంబయిలో భారీ కుట్రను ఛేదించారు. నిషేధిత తీవ్రవాద సంస్థ జైషే మహమ్మద్ (JeM) తో సంబంధాలు కలిగిన అనుమానిత ఉగ్రవాది మహమ్మద్ హసన్ అబు సర్మాద్ అక్తర్ (33)ను ముంబయిలోని మహిమ్ మెట్రో స్టేషన్ సమీపంలో ఏటీఎస్ అధికారులు అరెస్ట్ చేశారు. వృత్తిరీత్యా బైక్ టాక్సీ (రైడర్) డ్రైవర్‌గా, సెంట్స్ వ్యాపారిగా పనిచేస్తూనే.. అతడు గుట్టుచప్పుడు కాకుండా తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు అధికారులు పక్కా ఆధారాలతో నిరూపించారు.
అరెస్టయిన మహమ్మద్ హసన్ పాకిస్థానీ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్‌లతో (PIOs) ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉన్నాడని ఏటీఎస్ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సామాజిక మాధ్యమాలు, ముఖ్యంగా టెలిగ్రామ్ ప్లాట్‌ఫామ్‌లో పలు రహస్య గ్రూపులను నిర్వహిస్తూ.. జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజార్ తీవ్రవాద ప్రసంగాలకు సంబంధించిన ఆడియోలు, వీడియోలను ఇతరులతో పంచుకుంటున్నాడని గుర్తించారు. ఐబీఎన్-ఇ-ఖాసిం (IBN-e-Qasim) అనే పాక్ మద్దతు ఉన్న నెట్‌వర్క్ ఛానళ్లలో అతడు చురుగ్గా వ్యవహరిస్తూ యువతను తీవ్రవాదం వైపు ఆకర్షించేందుకు, మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు కుట్ర పన్నాడని దర్యాప్తు అధికారులు వెల్లడించారు.
ఈ దర్యాప్తులో మరింత సంచలన విషయం వెలుగుచూసింది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముంబయి పర్యటన సమయంలో చోటుచేసుకున్న భద్రతా లోపానికి సంబంధించిన ఒక నివేదిక కింద ఇన్‌స్టాగ్రామ్‌లో అతడు అత్యంత అనుమానాస్పద, వివాదాస్పద కామెంట్లు పెట్టినట్లు అధికారులు గుర్తించారు. నిందితుడి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్‌లో అనేక దేశ వ్యతిరేక డిజిటల్ ఆధారాలు, కంటెంట్‌ను ఏటీఎస్ సీజ్ చేసింది. ప్రధాని పర్యటన, నగరంపై దాడి ప్రణాళికలు లేదా భద్రతా సమాచారాన్ని పాక్ ఏజెంట్లకు చేరవేశాడా? అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. ఈ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న మిగతా వ్యక్తులను పట్టుకునేందుకు మహారాష్ట్ర వ్యాప్తంగా శోధన చర్యలు చేపట్టారు.




