Bird Flu : కోళ్ల నుంచి మనుషులకు బర్డ్ ఫ్లూ.. మహారాష్ట్రలో కలకలం..పుణె ల్యాబ్‌కు 8 మంది నమూనాలు
Bird Flu : మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లాలో బర్డ్ ఫ్లూ మనుషులకు సోకిందనే అనుమానంతో 8 మంది శాంపిల్స్‌ను పుణె ల్యాబ్‌కు పంపారు.
Bird Flu
Bird Flu : మహారాష్ట్రలో మరోసారి వైరస్ భయం పట్టుకుంది. నందుర్బార్ జిల్లాలోని నవాపూర్ ప్రాంతంలో బర్డ్ ఫ్లూ మనుషులకు సోకిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పక్షుల ద్వారా మనుషులకు ఈ వైరస్ వ్యాపించి ఉండవచ్చని భావిస్తున్న అధికారులు, ముందస్తు జాగ్రత్తగా 8 మంది పౌల్ట్రీ కార్మికుల నమూనాలను సేకరించారు. వీటిని క్షుణ్ణంగా పరీక్షించేందుకు పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(NIV)కి పంపించారు. బర్డ్ ఫ్లూ ప్రభావం ఎక్కువగా ఉన్న నందుర్బార్ జిల్లాలో ప్రస్తుతం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
అప్రమత్తమైన ఆరోగ్య శాఖ
జిల్లా ఆరోగ్య అధికారి రవీంద్ర సోనవణే తెలిపిన వివరాల ప్రకారం.. పక్షులను చంపే ప్రక్రియలో పాల్గొన్న సిబ్బందిని, పక్షులతో నేరుగా సంబంధం ఉన్న పౌల్ట్రీ కార్మికులను అధికారులు నిశితంగా గమనిస్తున్నారు. అనుమానిత ఎనిమిది మందిలో ప్రస్తుతానికి తీవ్రమైన లక్షణాలు ఏవీ లేకపోయినప్పటికీ, ఆ ఎనిమిది మంది నుంచి ముక్కు, గొంతు నమూనాలను సేకరించారు. వీరికి ముందు జాగ్రత్తగా టామీ ఫ్లూ మాత్రలను కూడా పంపిణీ చేశారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసే సిబ్బంది అందరికీ RT-PCR పరీక్షలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
లక్షణాలు కనిపిస్తున్న సిబ్బంది
గత కొద్ది రోజులుగా వైరస్ నియంత్రణ చర్యల్లో పాల్గొంటున్న పశువైద్య శాఖ ఉద్యోగులు అశోక్ లాల్సింగ్ పవార్, ఇందుస్ గోవల్యా వాల్విలో ఫ్లూ లక్షణాలు కనిపించడం కలకలం సృష్టించింది. వీరికి మే నెల మొదటి వారంలోనే జ్వరం, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు రావడంతో నవాపూర్ సబ్-డిస్ట్రిక్ట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వీరి ఆరోగ్యం మెరుగుపడటంతో డిశ్చార్జ్ చేశారు. అయితే, ఇప్పటివరకు మహారాష్ట్రలో ఈ వైరస్ వల్ల మనుషుల మరణాలు ఏవీ నమోదు కాలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
భారీ నష్టం
నందుర్బార్ జిల్లాలో మే 1 నుండి మే 17 వరకు బర్డ్ ఫ్లూ కట్టడి చర్యలు తీవ్రంగా జరిగాయి. ఈ 17 రోజుల్లోనే దాదాపు 15 పౌల్ట్రీ ఫారమ్స్‌లోని 4.06 లక్షల కోళ్లను చంపేశారు. అలాగే, సుమారు 24.9 లక్షల కోడిగుడ్లను, 5.48 లక్షల కిలోల పౌల్ట్రీ ఫీడ్‌ను అధికారులు ధ్వంసం చేశారు. దీనివల్ల పౌల్ట్రీ రంగానికి భారీ నష్టం వాటిల్లింది. పక్షుల నుంచి మనుషులకు వైరస్ సోకకుండా ఉండేందుకు జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ప్రజలు కూడా మాంసం, గుడ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది.




