Snail Attack : రైతులకు కొత్త కష్టం.. మహారాష్ట్రలో వింత విపత్తు.!

Snail Attack : మహారాష్ట్రలోని లాతూర్, ధారాశివ్ జిల్లాల రైతులకు ఈ వర్షాకాలంలో ఒక వింత ముప్పు వచ్చి పడింది. పొలాల్లో విత్తనాలు నాటిన కొన్ని వారాలకే..

G Krishna
Published on: 12 July 2026 12:21 PM IST
snail attack
X

snail attack

Snail Attack : మహారాష్ట్రలోని లాతూర్, ధారాశివ్ జిల్లాల రైతులకు ఈ వర్షాకాలంలో ఒక వింత ముప్పు వచ్చి పడింది. పొలాల్లో విత్తనాలు నాటిన కొన్ని వారాలకే, మొలకెత్తుతున్న సోయాబీన్ మొక్కలను పెద్ద పెద్ద నత్తలు (Snails) తినేస్తున్నాయి. దీంతో చేతికి వస్తున్న పంటలు నాశనమౌతుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఈ రెండు జిల్లాల్లోని సుమారు ఐదు నుండి ఏడు గ్రామాల్లో ఈ నత్తల దాడి ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా నదులు, చెరువులు, నీరు నిలిచిపోయే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పొలాలపై ఈ నత్తల ప్రభావం చాలా తీవ్రంగా ఉంది.

రాత్రి వేళల్లోనే నత్తల అటాక్

వ్యవసాయ అధికారుల సమాచారం ప్రకారం.. ఈ నత్తలు పగటిపూట కనిపించవు. సూర్యాస్తమయం అయిన తర్వాత రాత్రి వేళల్లో మాత్రమే ఇవి భూమిపైకి వస్తాయి. ఇప్పుడిప్పుడే పెరుగుతున్న సోయాబీన్ మొక్కల లేత ఆకులను ఇవి పూర్తిగా తినేస్తున్నాయి. పంట ప్రారంభ దశలోనే ఇలా జరగడంతో మొక్కలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. లాతూర్ జిల్లా రేనాపూర్ తాలూకాలోని వాడల్ గ్రామానికి చెందిన బలిరామ్ అనే రైతు మాట్లాడుతూ.. తన మూడు ఎకరాల పొలంలో దాదాపు 75 శాతం సోయాబీన్ పంటను ఈ నత్తలు తినేసి సర్వనాశనం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు.

నత్తల ఏరివేతలో కదిలిన గ్రామాలు

ఈ వింత సమస్యను ఎదుర్కోవడానికి గ్రామాల్లోని రైతుల కుటుంబాలన్నీ ఏకమయ్యాయి. చీకటి పడగానే అందరూ కలిసి పొలాల్లోకి వెళ్లి టార్చ్ లైట్ల సాయంతో ఈ నత్తలను చేతులతో పట్టుకుని, ఆ తర్వాత వాటిని నాశనం చేస్తున్నారు. "ఈ నత్తలు రాత్రిపూట బయటకు వస్తాయి. ఇవి భూమిలోపల 4 నుండి 5 అంగుళాల లోతులో గుడ్లు పెడతాయి. కాబట్టి ఈ పంట కాలం ముగిసిన తర్వాత తదుపరి విత్తనాలు నాటే ముందు పొలాలను చాలా లోతుగా దున్నాల్సి ఉంటుంది" అని ఒక వ్యవసాయ అధికారి తెలిపారు.

నత్తలు ఇంత వేగంగా పెరగడానికి కారణం ఏంటి.?

సాధారణంగా నత్తలు తడి, తేమతో కూడిన వాతావరణంలో చాలా వేగంగా పెరుగుతాయి. ప్రస్తుత వర్షాకాలం వాటి సంతానోత్పత్తికి, వ్యాప్తికి చాలా అనుకూలంగా మారింది. పొలాల్లో నీరు నిలిచిపోవడం వల్ల వాటికి మంచి ఆవాసం దొరికినట్లయింది. అదే సమయంలో లేత సోయాబీన్ మొక్కలు వాటికి ఆహారంగా దొరుకుతున్నాయి. వీటిని ఇలాగే వదిలేస్తే పక్కనే ఉన్న మిగతా పొలాలకు కూడా ఇవి వేగంగా పాకిపోయి భారీ నష్టాన్ని కలిగిస్తాయి.

అధికారుల సూచనలు..

ఈ నత్తల సైజు చాలా పెద్దదిగా ఉందని, ఇవి ఎక్కడి నుండి వచ్చాయనే దానిపై ఇంకా స్పష్టత రాలేదని సూపర్ఇంటెండెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్ మహేష్ తీర్థ్కర్ తెలిపారు. ఈ ముప్పు నుండి పంటలను కాపాడుకోవడానికి రైతులు తక్షణమే స్పందించాలని ఆయన కోరారు. పొలం గట్ల వెంబడి, అలాగే పొలం లోపల 'మెటాల్డిహైడ్' (Metaldehyde) గుళికలను ఉంచాలని రైతులకు సూచిస్తున్నారు. ఇది నత్తలను నివారించడానికి ఉపయోగపడే ఒక రకమైన కెమికల్. దీనితో పాటు రాత్రి వేళల్లో నత్తలను ఏరివేయడం, తదుపరి పంటకు ముందు లోతు దుక్కులు దున్నడం ద్వారా భూమిలో ఉన్న నత్తల గుడ్లను నాశనం చేయవచ్చని అధికారులు చెబుతున్నారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story