Earthquake : మహారాష్ట్రలో అర్ధరాత్రి భూకంపం.. పరుగులు పెట్టిన జనాలు..

Earthquake : మహారాష్ట్రలోని మరఠ్వాడా ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున స్వల్ప భూకంపాలు సంభవించాయి. హింగోలి, నాందేడ్, పర్భణీ జిల్లాల్లో అర్ధరాత్రి వేళ

G Krishna
Published on: 9 July 2026 11:06 AM IST
earthquake maharashtra
X

earthquake maharashtra

Earthquake : మహారాష్ట్రలోని మరఠ్వాడా ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున స్వల్ప భూకంపాలు సంభవించాయి. హింగోలి, నాందేడ్, పర్భణీ జిల్లాల్లో అర్ధరాత్రి వేళ భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే ఈ భూకంపం వల్ల ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం కానీ, ఆస్తి నష్టం కానీ జరగలేదని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.

ఒకే రాత్రి మూడుసార్లు.. హింగోలి సమీపంలో కేంద్రం

డిస్ట్రిక్ట్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం తెల్లవారుజామున 1:37 గంటల నుండి 3:23 గంటల మధ్య తక్కువ వ్యవధిలోనే వరుసగా భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై వీటి తీవ్రత వరుసగా 4.6, 3.6 , 3.9 గా నమోదైంది. ఈ భూకంప కేంద్రం హింగోలి జిల్లా బస్మత్ తాలూకాలోని షిర్లీ గ్రామానికి సమీపంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో వరుసగా భూమి కంపించడంతో భయంతో ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. భూకంపాలను ముందే ఊహించలేమని, భవిష్యత్తులో మరికొన్ని మైల్డ్ ఆఫ్టర్ షాక్స్ వచ్చే అవకాశాన్ని కొట్టిపారేయలేమని అధికారులు చెబుతున్నారు.

అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశం

భూకంపాల నేపథ్యంలో ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని, సురక్షితంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఒకవేళ మళ్లీ భూమి కంపించినట్లు అనిపిస్తే వెంటనే ఇళ్ల నుండి బయటకు వచ్చి, బహిరంగ ప్రదేశాల్లో ఉండాలని హింగోలి జిల్లా కలెక్టర్ రాహుల్ కర్దిలే ప్రజలకు సూచించారు. ఎలాంటి అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు హింగోలి, నాందేడ్, పర్భణీ జిల్లాల్లోని విపత్తు నిర్వహణ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది , వైద్య విభాగాలను అప్రమత్తం చేసినట్లు ఆయన వెల్లడించారు.

మహారాష్ట్రకు భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’

మరోవైపు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో వర్షాల తీవ్రత కొనసాగుతోంది. భారత వాతావరణ శాఖ (IMD) గురువారం ఉదయం జారీ చేసిన నివేదిక ప్రకారం.. నాసిక్, పాల్ఘర్, రాయ్‌గఢ్, పూణే , సతారా జిల్లాలకు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున 'రెడ్ అలర్ట్' జారీ చేసింది. అలాగే ముంబై సబర్బన్ ప్రాంతాలు , థానే జిల్లాలకు 'ఆరెంజ్ అలర్ట్' ప్రకటించింది. ధులే, నందుర్బార్, జలగావ్, కొల్హాపూర్, చంద్రపూర్ , గడ్చిరోలి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో 'ఎల్లో అలర్ట్' ఇచ్చింది. అయితే, రాబోయే రోజుల్లో బంగాళాఖాతంలో కొత్తగా ఎలాంటి రుతుపవన వ్యవస్థలు ఏర్పడే అవకాశం లేనందున ముంబై పరిసర ప్రాంతాలలో వర్షాల తీవ్రత క్రమంగా తగ్గుముఖం పట్టవచ్చని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా వేసింది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story