Maharashtra: "నన్ను వద్దనుకుంటే తప్పుకుంటా.. కానీ దొంగలకు ఇవ్వను!": ఉద్ధవ్ ఠాక్రే ఫైర్
Maharashtra: మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ. శివసేన (యూబీటీ)కి చెందిన ఆరుగురు ఎంపీలు తిరుగుబాటు చేయడంతో ఉద్ధవ్ ఠాక్రే భావోద్వేగ వ్యాఖ్యలు.
Maharashtra: "నన్ను వద్దనుకుంటే తప్పుకుంటా.. కానీ దొంగలకు ఇవ్వను!": ఉద్ధవ్ ఠాక్రే ఫైర్
Maharashtra: మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. అధికార శివసేన, ఉద్ధవ్ వర్గాల మధ్య పోరు పతాక స్థాయికి చేరింది. శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రేకు షాక్ ఇస్తూ ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎంపీలు తిరుగుబాటు బాట పట్టడం రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ తాజా పరిణామాలపై ఉద్ధవ్ ఠాక్రే తీవ్ర భావోద్వేగానికి లోనవగా.. ప్రత్యర్థి ఏక్‌నాథ్ షిండే మాత్రం సవాల్ విసిరారు.
నాలుగేళ్ల వ్యవధిలోనే పార్టీలో రెండోసారి చీలిక రావడంపై శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తొలిసారి స్పందించారు. శివసేన 60వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ముంబైలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. "సుమారు 13 ఏళ్లుగా నేను పార్టీకి సారథ్యం వహిస్తున్నాను. నా హయాంలోనే పార్టీ తీవ్రమైన సవాళ్లను, నాపై వ్యక్తిగత దాడులను ఎదుర్కొంది. ఎన్ని సవాళ్లు, అవరోధాలు ఎదురైనా సరే ఒంటరిగా పోరాడేందుకు నేను సిద్ధంగా ఉన్నాను" అని స్పష్టం చేశారు.
నాయకత్వ బాధ్యతలపై మాట్లాడుతూ.. "పార్టీ శ్రేణులు నన్ను వద్దనుకుంటే, అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకునేందుకు నేను సిద్ధం. ఎవరైనా నిజాయితీ గల శివసైనికుడు వచ్చి బాధ్యతలు తీసుకుంటానంటే సంతోషిస్తా. కానీ, వెన్నుపోటు పొడిచిన ద్రోహులకు, దొంగలకు మాత్రం పార్టీని అప్పగించే ప్రసక్తే లేదు" అంటూ షిండే వర్గాన్ని ఉద్దేశించి ఉద్ధవ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు, శివసేన చీఫ్ ఏక్‌నాథ్ షిండే ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యలపై పరోక్షంగా విరుచుకుపడ్డారు. ఉద్ధవ్ వర్గానికి చెందిన ఆరుగురు ఎంపీలు తమ పక్షాన చేరబోతున్నారనే వార్తల నేపథ్యంలో షిండే చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. "పులి తోలు కప్పుకున్నంత మాత్రాన తోడేలు ఎప్పటికీ పులిగా మారిపోదు. ఇప్పుడు జరిగింది కేవలం ఆరంభం మాత్రమే.. అసలు సినిమా ముందుంది" అంటూ షిండే పరోక్షంగా హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు మహారాష్ట్ర పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
2022లో శివసేనలో జరిగిన భారీ చీలిక తర్వాత, ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఎదుర్కొంటున్న మరో అతిపెద్ద అంతర్గత సంక్షోభం ఇది. ఆరుగురు పార్లమెంట్ సభ్యులు (MPs) ఒకేసారి పార్టీ వీడాలని నిర్ణయించుకోవడం ఉద్ధవ్ క్యాంప్‌కు గట్టి ఎదురుదెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామంతో పార్లమెంటు స్థాయిలో షిండే వర్గం మరింత బలోపేతం కానుంది. దీనిని తమ రాజకీయ విజయంగా షిండే వర్గం ప్రచారం చేసుకుంటుండగా, రానున్న రోజుల్లో మహారాష్ట్ర రాజకీయాల్లో మరిన్ని ఊహించని మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది.




