Mamata Banerjee: నన్ను అరెస్ట్ చేసుకోండి.. అనుమతి లేకపోయినా ధర్నా చేసి తీరుతా
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కోల్‌కతాలో ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ వెనక్కి తగ్గేదే లేదన్నారు.
Mamata Banerjee: నన్ను అరెస్ట్ చేసుకోండి.. అనుమతి లేకపోయినా ధర్నా చేసి తీరుతా
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఆ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఎన్నికల తర్వాతి హింసను నిరసిస్తూ, తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడికి వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతాలో ధర్నాకు పిలుపునిచ్చారు. అయితే, ఈ నిరసన కార్యక్రమానికి అనుమతి ఇచ్చేందుకు కోల్‌కతా పోలీసులు నిరాకరించారు. పోలీసుల నిర్ణయంపై 'దీదీ' తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అనుమతి ఇవ్వకపోయినా తాను ధర్నా నిర్వహించి తీరుతానని, కావాలంటే తనను అరెస్టు చేసుకోవచ్చని సవాల్ విసిరారు. ఈ మేరకు ఆమె సామాజిక మాధ్యమాల్లో ఒక వీడియోను విడుదల చేశారు.
బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం మునుపటిలా లేదని మమతా బెనర్జీ ఆరోపించారు. ప్రస్తుతం ప్రజలందరూ తీవ్ర భయంతో, ఆందోళనతో బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం టీఎంసీ పార్టీని వీడటంపై స్పందిస్తూ.. "నాయకులు పార్టీని వీడితే అది సంస్థ పునర్నిర్మాణానికి (Reconstruction) ఉపయోగపడుతుంది. దీనివల్ల టీఎంసీ భవిష్యత్తులో మరింత బలంగా పుంజుకుంటుంది" అని ధీమా వ్యక్తం చేశారు.
పోలీసు యంత్రాంగం ఒక రాజకీయ పార్టీని విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర పూరితంగా ప్రయత్నిస్తోందని మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. "శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఇక్కడ నిరసన తెలిపేందుకు కూడా నాకు అనుమతి ఇవ్వకపోతే.. నేను దేశ రాజధాని దిల్లీకి వెళ్లి మరి నా పోరాటాన్ని కొనసాగిస్తా" అని హెచ్చరించారు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బెంగాల్‌లో ఘోర అరాచకాలు సాగుతున్నాయని దీదీ పేర్కొన్నారు. ఇప్పటివరకు దాదాపు 12 మంది టీఎంసీ కార్యకర్తలు దారుణంగా హత్యకు గురయ్యారని, వేలాది మంది పార్టీ శ్రేణులను అక్రమంగా అరెస్టు చేసి జైళ్లలో పెట్టారని మమతా బెనర్జీ మండిపడ్డారు. పోలీసుల ఆంక్షలను ధిక్కరించి అయినా సరే ఈ హింసపై తాము ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని ఆమె స్పష్టం చేశారు.




