Mamata Banerjee: నేను రాజీనామా చేయను.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు!

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఓటమిపై మమతా బెనర్జీ ఘాటు వ్యాఖ్యలు. రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం. ఈవీఎంల తారుమారు, ఎన్నికల సంఘం తీరుపై ధ్వజమెత్తిన దీదీ. ఇండియా కూటమిలో క్రియాశీలకంగా ఉంటానని వెల్లడి.

Arun Chilukuri
Published on: 5 May 2026 5:04 PM IST
Mamata Banerjee
X

Mamata Banerjee: నేను రాజీనామా చేయను.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు!

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీ తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె కేంద్ర ప్రభుత్వం మరియు ఎన్నికల సంఘంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తాము పోరాడింది భారతీయ జనతా పార్టీతో కాదని, ఆ పార్టీ తరపున పనిచేసిన ఎన్నికల యంత్రాంగంతోనని ఆమె ఆరోపించారు.

ఓటమికి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా? అన్న ప్రశ్నకు ఆమె ఘాటుగా స్పందించారు. "నేను రాజీనామా చేసే ప్రసక్తే లేదు. ఇది ప్రజా తీర్పు వల్ల వచ్చిన ఓటమి కాదు, పక్కాగా జరిగిన కుట్ర. నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇలాంటి ఎన్నికలను ఎప్పుడూ చూడలేదు" అని దీదీ స్పష్టం చేశారు.

ఎన్నికల నిర్వహణ తీరుపై మమత పలు అనుమానాలను వ్యక్తం చేశారు. పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఈవీఎంలలో 80-90 శాతం ఛార్జింగ్ ఉండటం ఎలా సాధ్యమని ఆమె ప్రశ్నించారు. ఈవీఎంలను తారుమారు చేశారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం (CEC) ఒక విలన్‌లా వ్యవహరించిందని, ప్రజాస్వామ్య హక్కులను కాలరాసిందని మండిపడ్డారు. ఎన్నికలకు ముందే తమకు అనుకూలంగా ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను మార్చేసి, పార్టీ శ్రేణులను అరెస్ట్ చేయించారని ఆరోపించారు. సుమారు 90 లక్షల ఓటర్ల పేర్లను తొలగించారని, తాము కోర్టుకు వెళ్లిన తర్వాతే 32 లక్షల పేర్లను మళ్లీ చేర్చారని ఆమె వెల్లడించారు.

ఫలితాల తర్వాత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ వంటి కీలక నేతలు తనకు ఫోన్ చేసి సంఘీభావం తెలిపారని మమత చెప్పారు. భవిష్యత్తులో 'ఇండియా' (INDIA) కూటమిని మరింత బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని ఆమె ప్రకటించారు. బీజేపీ ఆడిన ఈ పొలిటికల్ గేమ్‌ను ఎదుర్కొని నిలబడతామని ధీమా వ్యక్తం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story