Punjab: భార్యను హత్య చేసి డ్రామాలాడిన భర్త.. అసలు విషయం ఎలా బయటపడిందంటే?

Punjab: భార్యపై అనుమానంతో గొంతు నులిమి హత్య చేసి, అత్యాచార కోణంలో చిత్రీకరించేందుకు ఆమె దుస్తులు తొలగించిన భర్తను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Arun Chilukuri
Published on: 11 Nov 2026 4:57 PM IST
Punjab
X

Punjab: భార్యను హత్య చేసి డ్రామాలాడిన భర్త.. అసలు విషయం ఎలా బయటపడిందంటే?

Punjab: భార్యపై ఉన్న అనుమానంతో భార్యని కడతేర్చడమే కాకుండా, ఆమెపై ఎవరో లైంగిక దాడి చేసి హత్య చేసినట్లు నమ్మించేందుకు ఒక భర్త అత్యంత కిరాతక ప్లాన్ పన్నాడు. పంజాబ్‌లోని హోషియార్‌పూర్ జిల్లాలో వెలుగుచూసిన ఈ సంచలన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాకు చెందిన జహదూర్ ఇస్లాం, తన భార్య రుబీనా ఖాతున్‌తో కలిసి ఉపాధి కోసం పంజాబ్‌కు వలసవచ్చాడు. హోషియార్‌పూర్ జిల్లా ముకేరియన్‌లోని మదీన్‌పూర్ గ్రామంలో నివసిస్తూ.. మురుగునీటి కాలువలు, డ్రైనేజీలను శుభ్రపరిచే పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే, తన భార్య రుబీనాకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో జహదూర్ గత కొంతకాలంగా ఆమెతో తరచూ గొడవ పడేవాడు.

ఇటీవల పని ముగిసిన తర్వాత భార్య రుబీనాను గ్రామం సమీపంలోని చెరువు వద్దకు జహదూర్ తీసుకెళ్లాడు. అక్కడ గుడ్డ తువ్వాలుతో ఆమె గొంతు నులిమి కిరాతకంగా హత్య చేశాడు. ఆ తర్వాత ఈ హత్యను అఘాయిత్యంగా మార్చేందుకు ప్లాన్ వేసిన నిందితుడు.. రుబీనా శరీరంపై ఉన్న దుస్తులను పూర్తిగా తొలగించాడు. సమీపంలోని చెరకు తోటలో ఆమె నగ్న మృతదేహాన్ని పడేసి, రుబీనాపై ఎవరో అత్యాచారానికి పాల్పడి హత్య చేశారంటూ అందరినీ నమ్మించేందుకు ప్రయత్నించాడు.

భార్య హత్య అనంతరం ఏమీ తెలియనట్లు బీహార్‌లోని కతిహార్ జిల్లాకు చెందిన తన బావ సోహెల్ అలీకి జహదూర్ ఫోన్ చేసి.. రుబీనా కనిపించడం లేదని నాటకం మొదలుపెట్టాడు. దీంతో ఆందోళన చెందిన రుబీనా సోదరుడు హుటాహుటిన పంజాబ్‌లోని మదీన్‌పూర్ గ్రామానికి చేరుకున్నాడు. ఇద్దరూ కలిసి ఆమె కోసం వెతికినట్లు నటించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే, పోలీసుల విచారణ సందర్భంగా భర్త జహదూర్ పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అతడిపై అనుమానం కలిగింది. తమదైన శైలిలో గట్టిగా విచారించడంతో, తానే స్వయంగా భార్యను హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. నిందితుడి వాంగ్మూలం ఆధారంగా చెరకు తోటలో పడేసిన రుబీనా నగ్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు.

భార్యపై ఎవరో లైంగిక దాడికి పాల్పడి హత్య చేశారనే అనుమానం కలిగించేందుకే నిందితుడు ఈ నాటకం ఆడాడని పోలీస్ అధికారి వెల్లడించారు. నిందితుడు జహదూర్ ఇస్లామ్‌ను అరెస్ట్ చేసి, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేసినట్లు తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.