Chandrapur: మహారాష్ట్రలో నలుగురిని బలిగొన్న నరభక్షక పులి ‘త్రిశూల్’ బంధనం!

Chandrapur: మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలో నలుగురిని బలిగొన్న నరభక్షక పెద్దపులి ‘త్రిశూల్’ను మత్తుమందు ఇచ్చి బంధించిన అటవీశాఖ అధికారులు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 6 Nov 2026 11:52 AM IST
Chandrapur
X

Chandrapur: మహారాష్ట్రలో నలుగురిని బలిగొన్న నరభక్షక పులి ‘త్రిశూల్’ బంధనం!

Chandrapur: మహారాష్ట్రలో నలుగురు రైతుల ప్రాణాలను బలిగొన్న నరభక్షక పెద్దపులి ‘త్రిశూల్‌’ను అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు బంధించారు. చంద్రపూర్ జిల్లా చిమూర్ తాలూకాలోని అటవీ ప్రాంతంలో సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఈ పులిని పట్టుకోవడంతో పరిసర గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

చిమూర్ అటవీ ప్రాంతంలో గత నెల 30న సదాశివ ఖడ సంగే, సిందేవాహి తాలూకాలో పత్రూ మేశ్రం, జూలై 6న నవేగావ్‌లో రాజేంద్ర భోయర్, ఏప్రిల్ 23న వహాన్‌గావ్ పరిసరాల్లో శంకర్ మేశ్రంలను ఈ పులి హతమార్చినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. వరుస దాడులతో అప్రమత్తమైన అటవీశాఖ సిబ్బంది పులి కదలికలను గుర్తించేందుకు అటవీ ప్రాంతంలో కెమెరాలు ఏర్పాటు చేసి ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ క్రమంలో గడగావ్ అటవీ క్షేత్రంలోని ఉరుకుడ్ పార్ గ్రామ శివారులో పులి సంచారాన్ని గుర్తించారు. షూటర్ అజయ్ మరాటే సహాయంతో పులికి మత్తుమందు ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేసి బంధించారు. అనంతరం డాక్టర్ రమాకాంత్ కోబ్రాగడే పర్యవేక్షణలో పులిని చంద్రపూర్‌కు తరలించినట్లు అటవీశాఖ సీసీఎఫ్ మహేష్ గైక్వాడ్ వెల్లడించారు.

వరుస పులి దాడులతో ఆందోళనకు గురైన గ్రామాల ప్రజలకు ఈ పరిణామం ఊరటనిచ్చింది. నాలుగు ప్రాణాలను బలిగొన్న పెద్దపులి పట్టుబడటంతో అటవీశాఖ అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.