Mann Ki Baat: బంగారం కొనుగోళ్లు తగ్గించిన దేశ ప్రజలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు!
Mann Ki Baat: ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ 135వ ఎపిసోడ్‌లో పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం కొనుగోళ్లు తగ్గించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
Mann Ki Baat: బంగారం కొనుగోళ్లు తగ్గించిన దేశ ప్రజలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు!
Mann Ki Baat: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో బంగారం కొనుగోళ్లు తగ్గడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా తాను ఇచ్చిన పిలుపును గౌరవించి, బంగారం కొనుగోళ్లను తగ్గించుకున్నందుకు దేశ ప్రజలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ‘మన్ కీ బాత్’ 135వ ఎపిసోడ్‌లో ప్రధాని మోదీ పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారు.
"పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో సాధ్యమైనంత వరకు కొంతకాలం బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉండాలని నేను చేసిన విజ్ఞప్తికి ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. చాలా మంది సోషల్ మీడియా ద్వారా తమ అనుభవాలను పంచుకున్నారు. ఇంధన పొదుపు కోసం సొంత వాహనాలకు బదులు ఇతరులతో కలిసి ప్రయాణిస్తున్నామని, విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకున్నామని ప్రజలు చెప్పడం దేశభక్తికి నిదర్శనం" అని ప్రధాని కొనియాడారు.
యువత క్రీడల్లో రాణించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ ఈ విషయంలో నాగాలాండ్ రాష్ట్రం స్ఫూర్తిగా నిలుస్తోందని ప్రధాని అన్నారు. అక్కడ 5 నుంచి 12 ఏళ్ల చిన్నారుల కోసం ‘నాగాలాండ్ బేబీ లీగ్’ విజయవంతంగా నడుస్తోందన్నారు. అలాగే మహిళల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ‘నాగాలాండ్ విమెన్ ఫుట్‌సల్ లీగ్’ అద్భుత వేదికగా మారిందని ప్రశంసించారు. ఇండోర్ ఫుట్‌బాల్‌గా పిలిచే ఈ ఫుట్‌సల్ ఆటలో ప్రతి జట్టులో ఐదుగురు మాత్రమే ఉంటారని, చిన్న మైదానంలో వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ ఆడే ఈ ఆట ఆడబిడ్డల్లోని నైపుణ్యాన్ని పెంచుతోందని వివరించారు.
అంతరించిపోతున్న అరుదైన ‘హర్గిలా’ పక్షిని రక్షించడంలో అస్సాంకు చెందిన మహిళా సైన్యం (హర్గిలా ఆర్మీ) చేస్తోన్న కృషిని ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఒకప్పుడు అశుభంగా భావించి, ఆ పక్షి గూళ్లు ఉన్న చెట్లను కూడా నరికేసే వారని గుర్తు చేశారు. అయితే జీవశాస్త్రవేత్త పూర్ణిమా దేవి బర్మన్ చొరవతో ప్రజల్లో మార్పు వచ్చిందని, ప్రకృతిని శుభ్రంగా ఉంచే ఈ పక్షిని కాపాడేందుకు ‘హర్గిలా ఆర్మీ’ కంకణం కట్టుకోవడం అభినందనీయమని ప్రధాని మోదీ కొనియాడారు.




