Car Smuggling : దేశాన్ని వణికించిన కార్ల స్కాం.. విదేశీ కార్ల దందాతో ప్రభుత్వ ఖజానా ఖాళీ
Car Smuggling : ఈ స్మగ్లింగ్ రాకెట్‌లో ప్రముఖ సినీ నటులు, సెలబ్రిటీల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. తక్కువ ధరకే లగ్జరీ కార్లు వస్తున్నాయని ఆశపడి వీరు ఈ వాహనాలను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
Car Smuggling
Car Smuggling : భూటాన్ సరిహద్దుల గుండా జరుగుతున్న భారీ లగ్జరీ కార్ల స్మగ్లింగ్ రాకెట్‌ను కస్టమ్స్ శాఖ బట్టబయలు చేసింది. 'ఆపరేషన్ నుమ్‌ఖోర్' పేరుతో చేపట్టిన ఈ దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు 15 వేలకు పైగా ఖరీదైన వాహనాలను అక్రమ మార్గంలో భారత్‌లోకి తీసుకొచ్చి, ఫోర్జరీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించినట్లు అధికారులు గుర్తించారు. ఈ స్కామ్ వెనుక సినీ సెలబ్రిటీలు, బడా బాబుల హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు వందల కోట్ల రూపాయల గండి పడింది.
ఆపరేషన్ నుమ్‌ఖోర్ వెనుక అసలు కథ
కస్టమ్స్ అధికారులు చేపట్టిన 'ఆపరేషన్ నుమ్‌ఖోర్' (భూటానీ భాషలో నుమ్‌ఖోర్ అంటే వాహనం) ద్వారా భారత్‌లో జరుగుతున్న ఒక భారీ స్మగ్లింగ్ నెట్‌వర్క్ వెలుగు చూసింది. ప్రారంభంలో కేరళలో కేవలం 35 నుంచి 40 కార్లపై వచ్చిన అనుమానంతో దర్యాప్తు మొదలుపెట్టిన అధికారులకు, లోతుగా వెళ్లే కొద్దీ కళ్లు తిరిగే నిజాలు తెలిశాయి. దేశవ్యాప్తంగా దాదాపు 15,849 వాహనాలు ఎటువంటి ట్యాక్స్ లేదా కస్టమ్ డ్యూటీ చెల్లించకుండానే భారత్‌లోకి ప్రవేశించాయని గుర్తించారు. ఇవన్నీ విదేశీ లేదా లగ్జరీ కార్లు కావడం గమనార్హం.
డిజిటల్ ఆడిట్‌లో దొరికిపోయారు
నేషనల్ వెహికల్ రిజిస్ట్రీని డిజిటల్ ఆడిట్ చేస్తున్న సమయంలో ఈ భారీ అక్రమాలు బయటపడ్డాయి. ఆర్మీ నుంచి వేలం వేసిన పాత వాహనాలని నమ్మించడానికి నకిలీ డిస్పోజల్ సర్టిఫికెట్లు సృష్టించి ఈ కార్లను రిజిస్ట్రేషన్ చేయించారు. మరికొన్ని ఖరీదైన కార్ల కోసం విదేశీ రాయబార కార్యాలయాలు లేదా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఫోర్జరీ పత్రాలను వాడారు. ఇలా చేయడం వల్ల వందల కోట్లలో చెల్లించాల్సిన కస్టమ్ డ్యూటీని ఎగవేశారు. ఈ పత్రాలు ఎంత హై-క్వాలిటీగా ఉన్నాయంటే, అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తే తప్ప అవి నకిలీవని తేలలేదు.
సెలబ్రిటీల చుట్టూ ఉచ్చు
ఈ స్మగ్లింగ్ రాకెట్‌లో ప్రముఖ సినీ నటులు, సెలబ్రిటీల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. తక్కువ ధరకే లగ్జరీ కార్లు వస్తున్నాయని ఆశపడి వీరు ఈ వాహనాలను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కేరళలో ఇప్పటికే 50కి పైగా వాహనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అస్సాం వంటి ఈశాన్య రాష్ట్రాల సరిహద్దుల గుండా ఈ కార్లను నకిలీ రిజిస్ట్రేషన్లతో దేశంలోని ఇతర ప్రాంతాలకు తరలించారు. అసోంలోనే దాదాపు 464 వాహనాలు ఇలా అక్రమంగా రిజిస్టర్ అయినట్లు గుర్తించారు. ఈ లిస్టులో ఉన్న ప్రముఖులు ఎవరో త్వరలోనే బయటపడే అవకాశం ఉంది.
భారత్-భూటాన్ అధికారుల కీలక భేటీ
ఈ అక్రమ రవాణాను అరికట్టడానికి కేరళలోని మున్నార్‌లో భారత్, భూటాన్ కస్టమ్స్ అధికారుల మధ్య 7వ సమన్వయ సమావేశం ప్రారంభమైంది. సరిహద్దుల్లో భద్రతను ఎలా పెంచాలి, స్మగ్లింగ్‌కు గురైన SUVలు, లగ్జరీ కార్లను ఎలా పట్టుకోవాలి అనే అంశంపై ఇరు దేశాల అధికారులు చర్చిస్తున్నారు. పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఫోర్జరీ పత్రాలతో వాహనాలను రిజిస్టర్ చేసిన ఆర్టీఓ అధికారుల పాత్రపై కూడా విచారణ జరపాలని నిర్ణయించారు.




