Cancer Drugs: భారీగా తగ్గిన మందుల ధరలు.. క్యాన్సర్ బాధితులకు బిగ్ రిలీఫ్
Cancer Drugs: క్యాన్సర్ రోగులకు కేంద్రం తీపి కబురు అందించింది. 543 రకాల క్యాన్సర్ మందుల ధరలను ఏకంగా 90 శాతం వరకు తగ్గించింది.
Cancer Drugs
Cancer Drugs: క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న బాధితులకు, వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఎంతో ఉపశమనాన్ని ఇచ్చే తీపి కబురు అందించింది. ప్రాణాంతకమైన ఈ మహమ్మారి చికిత్సకు ఉపయోగించే దాదాపు 543 రకాల ఔషధాల ధరలను సవరిస్తూ ప్రకటన విడుదల చేసింది. కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఔషధాల ధరల నియంత్రణ సంస్థ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని ఔషధాలపై గరిష్టంగా 90 శాతానికి పైగా ధరలు తగ్గడం విశేషం. ఈ సరికొత్త సవరించిన ధరలు నవంబర్ 9వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి.
ట్రేడ్ మార్జిన్‌పై పరిమితి
క్యాన్సర్ చికిత్సలో వాడే మందుల విక్రయాలపై విపరీతంగా పెరిగిన ధరలను అదుపు చేసేందుకు ప్రభుత్వం గట్టి చర్యలే చేపట్టింది. సుమారు 137 రకాల యాంటీ క్యాన్సర్ మందుల ట్రేడ్ మార్జిన్‌ను గరిష్టంగా 30 శాతానికి పరిమితం చేస్తున్నట్లు తెలిపింది. తయారీ వ్యయానికి, విక్రయించే ధరకు మధ్య ఉండే వ్యత్యాసాన్ని తగ్గించడం వల్ల సామాన్యులకు వైద్యం అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. కంపెనీలు అందించిన సమాచారం ఆధారంగా జాబితాను రూపొందించిన అధికారులు, రాబోయే రోజుల్లో ఇతర మందుల ధరలను కూడా క్రమబద్ధీకరించి ఈ జాబితాకు జోడిస్తామని స్పష్టం చేశారు.
తగ్గింపుల్లో భారీ స్వల్పం
ముఖ్యమైన ఔషధాల పరంగా చూస్తే, గతంలో వేల రూపాయల భారం మోపిన మందులు ఇప్పుడు అతి తక్కువ ధరలకే లభించనున్నాయి. ఉదాహరణకు అనార్జోల్ అనే మందు పాత ధర రూ.695 కాగా, అది భారీగా తగ్గి కేవలం రూ.73కే లభించనుంది. అలాగే గతంలో రూ.26,000 పైగా ఉన్న ఫుల్బ్రెకా ధర ఇప్పుడు సుమారు రూ.5,491కే అందుబాటులోకి రానుంది. అదేవిధంగా బెవాసిజుమాబ్, డెబ్రుమాబ్ లాంటి అత్యంత ఖరీదైన ఇంజెక్షన్లు, మందుల ధరలు కూడా దాదాపు రూ.15,000 నుంచి రూ.16,000 వరకు తగ్గాయి. ఫ్లూడానాక్స్, అజాసిటిన్ వంటి మందుల ధరలు 75 నుంచి 80 శాతానికి పైగా దిగివచ్చాయి.
రోగులకు తగ్గిన ఆర్థిక భారం
ఏళ్ల తరబడి క్యాన్సర్ చికిత్స పొందుతూ ఆర్థికంగా చితికిపోతున్న ఎన్నో కుటుంబాలకు ప్రభుత్వ నిర్ణయం ఒక రక్షణ కవచంలా మారనుంది. దాసనాట్, ఎనుటా, ఎర్లిబ్ వంటి ప్రాణరక్షణ మందులపై 50 నుంచి 60 శాతానికి పైగా ధరలు తగ్గడంతో రోగులపై నానాటికీ పెరుగుతున్న ఆర్థిక భారం చాలావరకు తగ్గుతుంది. నాణ్యమైన వైద్యాన్ని, అత్యవసర మందులను సామాన్య పౌరులకు సైతం తక్కువ వ్యయానికే తగిన సమయంలో అందించడమే లక్ష్యంగా ఈ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినట్లు అధికారులు వెల్లడించారు.




