Delhi: అపాయింట్‌మెంట్లు రద్దు చేసుకుని హోంమంత్రి అమిత్ షా హైలావల్ సమీక్ష.. దిల్లీలో ఉద్రిక్తత

Delhi: దిల్లీలో సీఈసీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి, సీజేపీ భారీ నిరసనల నేపథ్యంలో 20 వేల బలగాలతో కఠిన భద్రత. అమిత్ షా సమీక్షలు, మెట్రో స్టేషన్ల మూసివేత పూర్తి వివరాలు.

Arun Chilukuri
Published on: 9 Oct 2026 1:39 PM IST
Delhi
X

Delhi: అపాయింట్‌మెంట్లు రద్దు చేసుకుని హోంమంత్రి అమిత్ షా హైలావల్ సమీక్ష.. దిల్లీలో ఉద్రిక్తత

Delhi: ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ వ్యవహారశైలికి వ్యతిరేకంగా ప్రతిపక్ష 'ఇండియా' (INDIA) కూటమి మరియు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) దిల్లీలో భారీ నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో దేశ రాజధాని అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో దిల్లీ వ్యాప్తంగా అత్యంత కఠినమైన భద్రతా చర్యలను అమలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై ఏకంగా 20 వేలకు పైగా పోలీసులు, పారామిలిటరీ బలగాలను రంగంలోకి దించింది.

దేశ రాజధానిలో పరిణామాల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన అధికారిక పర్యటనలు, అపాయింట్‌మెంట్లన్నింటినీ రద్దు చేసుకున్నారు. గత రెండ్రోజులుగా దిల్లీ సహా పొరుగు రాష్ట్రాల్లోని పరిస్థితులపై ఆయన అత్యున్నత స్థాయి సమీక్షలు నిర్వహిస్తూ భద్రతను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

జంతర్‌మంతర్‌ వద్ద నిరసనకు పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ, భారీగా ఆందోళనకారులు చేరుకునే అవకాశం ఉండటంతో సరిహద్దుల్లో తనిఖీలు తీవ్రం చేశారు. నిరసనకారులను పర్యవేక్షించేందుకు సీసీటీవీ కెమెరాలు, ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS) టెక్నాలజీని వాడుతున్నారు.

రాబోయే మూడు రోజుల పాటు భారీ ఆందోళనలు జరిగే అవకాశం ఉండటంతో దిల్లీలోని 57 మెట్రో స్టేషన్లను రెండు రోజుల పాటు మూసివేయాలని దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌ను పోలీసులు కోరారు. అలాగే శనివారం న్యూదిల్లీ - హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ల మధ్య కొన్ని గంటల పాటు రైలు సర్వీసులను రద్దు చేసే ఛాన్స్ ఉంది.

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ నివాసం మరియు ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం వద్ద జెడ్‌+ (Z+) భద్రతతో పాటు భారీగా అదనపు బలగాలను మోహరించారు. సోషల్ మీడియా పోస్టులపై సైతం సైబర్ వింగ్ ప్రత్యేక నిఘా ఉంచింది. మరోవైపు దిల్లీకి బయలుదేరిన తమ కార్యకర్తలను నాగ్‌పూర్, భోపాల్ రైల్వే స్టేషన్లలో పోలీసులు అడ్డుకుంటున్నట్లు సీజేపీ ఆరోపించింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.