Ex-Boyfriend: భార్య మాజీ ప్రియుడిని కలవడం తప్పు కాదు .. హైకోర్టు సంచలన తీర్పు
Ex-Boyfriend: పెళ్లయిన తర్వాత మాజీ ప్రియుడిని ఒక్కసారి కలిస్తే అది వివాహేతర సంబంధం కాదని పంజాబ్ & హరియాణా హైకోర్టు స్పష్టం చేసింది.
Ex-Boyfriend: భార్య మాజీ ప్రియుడిని కలవడం తప్పు కాదు .. హైకోర్టు సంచలన తీర్పు
Punjab & Haryana High Court: పెళ్లయిన తర్వాత భార్య తన మాజీ ప్రియుడిని కేవలం ఒక్కసారి కలిస్తే.. దానిని వివాహేతర సంబంధంగా చట్టబద్ధంగా పరిగణించలేమని పంజాబ్, హరియాణా హైకోర్టు ఒక సంచలన తీర్పునిచ్చింది. కేవలం అనుమానంతో, ఒకే ఒక్క భేటీ ఆధారంగా భార్యపై వ్యభిచారం ముద్ర వేయలేమని కోర్టు స్పష్టం చేసింది. అయితే, అక్రమ సంబంధం ఆరోపణలను తోసిపుచ్చినప్పటికీ.. సదరు మహిళకు కోర్టు విడాకులు మాత్రం ఖరారు చేసింది. భారత నౌకాదళంలో పనిచేస్తున్న ఒక ఉద్యోగికి, అతని భార్యకు మధ్య కొంతకాలంగా తీవ్ర వివాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో తన భార్యకు వివాహేతర సంబంధం ఉందంటూ భర్త కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసును విచారించిన గుర్దాస్‌పూర్ ఫ్యామిలీ కోర్టు, 2026 ఫిబ్రవరిలో ఆ దంపతులకు విడాకులు మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. అయితే, ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఈ తీర్పును సవాలు చేస్తూ భార్య పంజాబ్, హరియాణా హైకోర్టును ఆశ్రయించింది.
ఈ కేసును క్షుణ్ణంగా పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం.. వివాహేతర సంబంధం అనే ఆరోపణలపై కీలక వ్యాఖ్యలు చేసింది. వివాహానికి ముందు ఒక వ్యక్తితో రిలేషన్‌లో ఉండటం నేరం కాదు. పెళ్లయిన తర్వాత కూడా సదరు మహిళ తన మాజీ ప్రియుడిని కేవలం ఒక్కసారి మాత్రమే కలిసింది. కేవలం ఒకే ఒక్క ముఖాముఖి భేటీ ఆధారంగా ఆమె మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందని లేదా వ్యభిచారం చేస్తూ జీవిస్తోందని నిర్ధారించలేమని కోర్టు స్పష్టం చేసింది. చట్టప్రకారం దీనిని అడల్ట్రీగా పరిగణించడానికి వీల్లేదని కోర్టు భర్త చేసిన ఆరోపణలను తోసిపుచ్చింది.
భార్యపై వచ్చిన అక్రమ సంబంధం ఆరోపణలను హైకోర్టు కొట్టేసినప్పటికీ.. ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన విడాకుల తీర్పును మాత్రం సమర్థించింది. దీని వెనుక భార్య చేసిన కొన్ని తీవ్రమైన తప్పులను హైకోర్టు ఎత్తిచూపింది. సదరు మహిళ తన భర్త, అత్తగారి కుటుంబంపై ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేకుండానే కట్నం వేధింపుల కేసులు పెట్టి వేధించింది. వృద్ధుడైన తన మామగారి కన్ను తనపై పడిందని ఆమె కోర్టులో ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలకు సంబంధించిన స్టేట్‌మెంట్లలో తీవ్ర విరుద్ధమైన ప్రకటనలు ఉన్నాయని కోర్టు గుర్తించింది.
కుటుంబ ప్రతిష్ఠను నడిరోడ్డుపైకి లాగుతూ, అత్తమామలపై ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి ఘోరమైన నిందలు వేయడం భర్త ,అతని కుటుంబం పట్ల తీవ్రమైన మానసిక క్రూరత్వానికి కిందికే వస్తుందని హైకోర్టు తేల్చిచెప్పింది. సమాజంలో గౌరవంగా బతికే కుటుంబంపై నిరాధారమైన నిందలు వేయడం విడాకులు ఇవ్వడానికి వంద శాతం సరైన కారణమేనని పేర్కొంటూ పంజాబ్, హరియాణా హైకోర్టు ఆ దంపతుల విడాకులను ఖరారు చేస్తూ తుది తీర్పునిచ్చింది.




