Mehbooba Mufti : పైకి ఫైటింగ్.. లోపల మీటింగ్.. ఇండియా-పాక్ మధ్య 'సీక్రెట్' స్టోరీ బయటపెట్టిన మెహబూబా
Mehbooba Mufti : భారత్-పాకిస్థాన్ మధ్య గత మూడు నెలలుగా రహస్య చర్చలు జరుగుతున్నాయని జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ సమస్యకు చర్చలే పరిష్కారమని ఆమె ఉద్ఘాటించారు.
Mehbooba Mufti
Mehbooba Mufti : జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించేలా ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు. భారత్ - పాకిస్థాన్ మధ్య పైకి వాడివేడి విమర్శలు వినిపిస్తున్నప్పటికీ, తెర వెనుక మాత్రం మూడు నెలలుగా రహస్య చర్చలు జరుగుతున్నాయని ఆమె క్లెయిమ్ చేశారు. పూంచ్‌లో జరిగిన ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ముఫ్తీ వాదన ప్రకారం.. భారత్, పాకిస్థాన్‌కు చెందిన రిటైర్డ్ దౌత్యవేత్తలు, మాజీ ఆర్మీ అధికారులు విదేశాల్లో సమావేశమై చర్చలు జరుపుతున్నారు. "బయట ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నా, లోపల మాత్రం మంతనాలు సాగుతున్నాయి. గత మూడు నెలలుగా ఈ సీక్రెట్ చర్చలు జరుగుతున్నాయి" అని ఆమె పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ కంటే ముందే ఈ చర్చలు ఫలించి ఉంటే సరిహద్దులో ప్రాణనష్టం జరిగేది కాదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
తండ్రి బాటలో పరిష్కారం
కాశ్మీర్ సమస్యకు కేవలం చర్చల ద్వారానే పరిష్కారం దొరుకుతుందని మెహబూబా ముఫ్తీ ఉద్ఘాటించారు. తన తండ్రి, మాజీ సీఎం ముఫ్తీ మహమ్మద్ సయీద్ రూపొందించిన బ్లూప్రింట్ నేటికీ రాష్ట్రంలో శాంతి స్థాపనకు అత్యంత కీలకమైన మార్గమని ఆమె గుర్తు చేశారు. "ముఫ్తీ సాబ్ ఎప్పుడూ చెప్పేవారు.. బీజేపీ ఎంత వ్యతిరేకించినా, చివరకు చర్చల మేజా దగ్గరకు రావాల్సిందే. అది తప్ప మరో మార్గం లేదు" అని ఆమె స్పష్టం చేశారు.
సరిహద్దు వాణిజ్యంపై ఆవేదన
రావాలాకోట్ మార్గం మూసివేతపై మెహబూబా ముఫ్తీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో తాము ఎల్ఓసి మీదుగా ప్రారంభించిన వాణిజ్యం, ప్రయాణ సౌకర్యాలు నిలిచిపోవడం వల్ల స్థానికులు ఉపాధి కోల్పోయారని ఆమె అన్నారు. యువత చేతుల్లో ఆయుధాలకు బదులు ఉపాధి ఉండాలనేది తమ లక్ష్యమని, కానీ ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని విమర్శించారు.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇబ్బందులు
2019లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ వల్ల పిర్ పంజాల్, చినాబ్ వ్యాలీ ప్రజలు తీవ్రంగా నష్టపోయారని మెహబూబా ఆరోపించారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరిగిపోయాయని, పేదల పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతోందని మండిపడ్డారు. ముఖ్యంగా గుజ్జర్, బకర్వాల్ కమ్యూనిటీలను భూ కబ్జాదారులుగా చిత్రీకరించి ఇబ్బందులు పెడుతున్నారని దుయ్యబట్టారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండి, ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు.




