Congress: మేకెదాటు డ్యాంపై కాంగ్రెస్‌లో చిచ్చు.. సొంత పార్టీ సీఎంకే వార్నింగ్!

Congress: కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా నలుగుతున్న మేకెదాటు ప్రాజెక్టు (Mekedatu Dam Project) వివాదం మరోసారి తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది.

Arun Chilukuri
Published on: 14 Nov 2026 5:40 PM IST
Congress
X

Congress: మేకెదాటు డ్యాంపై కాంగ్రెస్‌లో చిచ్చు.. సొంత పార్టీ సీఎంకే వార్నింగ్!

Congress: కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా నలుగుతున్న మేకెదాటు ప్రాజెక్టు (Mekedatu Dam Project) వివాదం మరోసారి తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. అయితే ఈసారి ఇరు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న లేదా బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతల మధ్యే మాటల యుద్ధం మొదలవ్వడం చర్చనీయాంశంగా మారింది. ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎవరూ ఆపలేరంటూ ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది.

డీకే శివకుమార్ వ్యాఖ్యలపై తమిళనాడు కాంగ్రెస్ చీఫ్ మాణికం ఠాగూర్ ఘాటుగా స్పందించారు. డీకేఎస్ చేసిన వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, దిగువ రాష్ట్రాల అనుమతి లేకుండా మేకెదాటు ప్రాజెక్టులో ఒక్క ఇటుక కూడా వేయనీయమని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఈ డ్యాం నిర్మాణం వల్ల తమిళనాడుకు ఎటువంటి హాని జరగదంటూ డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలను ఠాగూర్ పూర్తిగా తోసిపుచ్చారు. ఆయన వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవని కొట్టిపారేశారు.

మేకెదాటు ప్రాజెక్టు నిర్మాణం చేపడితే తమిళనాడులోని కావేరీ డెల్టా ప్రాంతం పూర్తిగా ఎడారిగా మారిపోతుందని మాణికం ఠాగూర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దిగువ రాష్ట్రాల సమ్మతి లేకుండా ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దని, అందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు ఇవ్వకూడదని ఆయన డిమాండ్ చేశారు.

ఇటీవల మైసూరులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న ఓ బహిరంగ సభలో కర్ణాటక సీఎం డీకే శివకుమార్ మాట్లాడుతూ.. మేకెదాటు నిర్మాణంపై కర్ణాటకకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎవరూ అడ్డుకోలేరని వ్యాఖ్యానించిన ఆయన, వెంటనే నిర్మాణానికి అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో, ముఖ్యంగా సొంత పార్టీ నేతల మధ్యే తీవ్ర వివాదానికి ఆజ్యం పోశాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.