Mekedatu Dam Row: కావేరి చిచ్చు: తమిళనాడు, కర్ణాటక బోర్డర్‌లో హైటెన్షన్!
Mekedatu Dam Row: కావేరి నదిపై మేకెదాటు డ్యాం నిర్మాణ వివాదంతో కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది.
Mekedatu Dam Row: కావేరి చిచ్చు: తమిళనాడు, కర్ణాటక బోర్డర్‌లో హైటెన్షన్!
Mekedatu Dam Row: కావేరి నదిపై మేకెదాటు డ్యాం నిర్మాణ వివాదం మరోసారి చిచ్చురేపింది. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దుల్లో ఇరుపక్షాలూ పోటాపోటీ ఆందోళనలకు పిలుపునివ్వడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా తమిళనాడు రవాణా సంస్థకు చెందిన బస్సుల సర్వీసులను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.
మేకెదాటు ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు రైతు సంఘాలు బుధవారం ఉదయం హోసూరు సమీపంలోని అంతరాష్ట్ర సరిహద్దు వద్ద భారీ పాదయాత్రకు పిలుపునిచ్చాయి. దీనికి కౌంటర్‌గా కర్ణాటకకు చెందిన పలు కన్నడ సంఘాలు కూడా రంగంలోకి దిగాయి. డ్యాం నిర్మించి తీరుతామంటూ కర్ణాటక సరిహద్దులోని అత్తిప్పళ్లి వద్ద ఆందోళనలు చేపట్టనున్నట్లు ప్రకటించాయి.
ఒకే సమయంలో ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో ఆందోళనలు ప్రకటించడంతో అటు తమిళనాడు, ఇటు కర్ణాటక పోలీసులు సరిహద్దు ప్రాంతాల్లో భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా ఉంచారు. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా కర్ణాటక వైపు వెళ్తున్న తమిళనాడు ప్రభుత్వ బస్సులను సరిహద్దులోనే నిలిపివేశారు. అయితే, కర్ణాటక ప్రభుత్వ బస్సులను మాత్రం తమిళనాడులోకి యథావిధిగా అనుమతిస్తుండటం గమనార్హం. ప్రయాణికుల రక్షణ దృష్ట్యా ఉన్నతాధికారులు పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నారు.




