LPG Tanker : 3 వేల కాల్స్, 5 వేల ఈమెయిల్స్.. కంట్రోల్ రూమ్ అలర్ట్.. యుద్ధక్షేత్రం నుంచి భారత్‌కు గ్యాస్ ట్యాంకర్
LPG Tanker : కతార్ నుంచి బయలుదేరిన భారత ఎల్పీజీ ట్యాంకర్ నందా దేవి యుద్ధ ఉద్రిక్తతల మధ్య సురక్షితంగా వడి నార్ పోర్టుకు చేరుకుంది. 22 మంది నావికులున్న మరో చమురు నౌక కూడా భారత్ కు రానుంది.
Nanda Devi LPG Tanker
LPG Tanker : పశ్చిమాసియాలో యుద్ధం ముదురుతున్న తరుణంలో భారతీయ ఇంధన సరఫరాకు సంబంధించి ఊరటనిచ్చే వార్త వెలుగు చూసింది. కతార్‌లోని రాస్ లఫాన్ పోర్ట్ నుంచి బయలుదేరిన నందా దేవి ఎల్పీజీ ట్యాంకర్ మంగళవారం (మార్చి 17) ఉదయం సురక్షితంగా గుజరాత్‌లోని వడి నార్ పోర్టుకు చేరుకుంది. మార్చి 1వ తేదీన కతార్ నుంచి ప్రయాణం మొదలుపెట్టిన ఈ భారీ నౌక, యుద్ధం కారణంగా ఉద్రిక్తంగా మారిన సముద్ర మార్గాలను దాటుకుని ఎట్టకేలకు గమ్యాన్ని చేరుకుంది. దేశంలో ఒక రోజుకు అవసరమైన వంటగ్యాస్ (LPG) అవసరాలను తీర్చగల సామర్థ్యం ఈ నౌకలో ఉన్న ఇంధనానికి ఉందని అధికారులు చెబుతున్నారు.
మరోవైపు యూఏఈలోని ఫుజైరా పోర్టుపై దాడులు జరిగినప్పటికీ, దాదాపు 80,800 టన్నుల ముడి చమురుతో వస్తున్న భారత నౌక జగ్ లాడ్కీ కూడా సురక్షితంగా ఉందని కేంద్ర నౌకాయాన మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ కుమార్ సిన్హా ధృవీకరించారు. ఈ నౌకలో ఉన్న 22 మంది భారతీయ నావికులు క్షేమంగా ఉన్నారని, ఇది నేడు ముంద్రా పోర్టుకు చేరుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు. గత రెండు వారాలుగా యుద్ధం కారణంగా హోర్ముజ్ జలసంధిలో చిక్కుకున్న 28 భారతీయ నౌకల్లో ఇవి కూడా ఉండటం గమనార్హం.
ప్రస్తుతం పశ్చిమ పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో 22 భారతీయ నౌకలు, దాదాపు 611 మంది నావికులు ఇంకా చిక్కుకుని ఉన్నారు. వీరిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి భారత ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే శివాలిక్ అనే మరో ఎల్పీజీ నౌక గుజరాత్‌లోని ముంద్రాకు చేరుకోగా, ఇప్పుడు నందా దేవి కూడా తోడవ్వడంతో దేశీయంగా గ్యాస్ కొరత ఏర్పడకుండా తక్షణ ఉపశమనం లభించింది. ఈ రెండు నౌకల్లో కలిపి సుమారు 92,712 టన్నుల ఎల్పీజీ గ్యాస్ ఉంది.
యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల నుంచి రావాల్సిన ఇంధన సరఫరాపై ప్రభావం పడినప్పటికీ, భారత్ ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. రష్యా వంటి దేశాల నుంచి ముడి చమురు దిగుమతులను పెంచుకోవడం ద్వారా చమురు అవసరాలను తీర్చుకుంటోంది. అయితే, పారిశ్రామిక అవసరాలకు గ్యాస్ సరఫరాలో కొంత కోత విధించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. డీజీ షిప్పింగ్ కంట్రోల్ రూమ్ నిరంతరం పనిచేస్తూ నావికుల కుటుంబాలతో టచ్‌లో ఉంది. గత 48 గంటల్లోనే మరో 33 మంది భారతీయ నావికులను సురక్షితంగా స్వదేశానికి రప్పించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.




