Delhi Earthquake : ఢిల్లీని వణికించిన భూకంపం.. ఉలిక్కిపడ్డ ప్రజలు

Delhi Earthquake : ఢిల్లీ ఉత్తర జిల్లాలో తెల్లవారుజామున రిక్టర్ స్కేలుపై 2.9 తీవ్రతతో తేలికపాటి భూకంపం సంభవించింది. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. ఢిల్లీ సిస్మిక్ జోన్-IV పరిధిలోకి వస్తుంది.

CR Reddy
Published on: 2 Aug 2026 7:06 AM IST
Delhi Earthquake : ఢిల్లీని వణికించిన భూకంపం.. ఉలిక్కిపడ్డ ప్రజలు
X

Delhi Earthquake : దేశ రాజధాని ఢిల్లీలో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. ఉత్తర ఢిల్లీ ప్రాంతంలో భూమి కంపించడంతో నిద్రపోతున్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడి భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 2.9గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. ఈ భూకంపం చాలా తేలికపాటిది కావడం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం గానీ, ఆస్తి నష్టం గానీ జరగకపోవడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

ఢిల్లీకి ఎందుకంత ప్రమాదం?

ఢిల్లీ భూకంప పరంగా అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో ఒకటి. భారతదేశ భూకంప విపత్తు వర్గీకరణ ప్రకారం ఢిల్లీ సిస్మిక్ జోన్-IV కిందకు వస్తుంది. అంటే ఇది మోస్తరు నుంచి అధిక భూకంప ప్రమాదం ఉన్న ప్రాంతంగా పరిగణించబడుతుంది. గతంలో కూడా ఇక్కడ పలుమార్లు భూకంపాలు వచ్చాయి. ఈ ఏడాది జూన్ 27న ఆఫ్ఘనిస్థాన్ కేంద్రంగా వచ్చిన 6.2 తీవ్రత భూకంపం వల్ల ఢిల్లీతో పాటు ఉత్తర భారతదేశమంతా తీవ్ర ప్రకంపనలు వచ్చాయి. అలాగే ఏప్రిల్ నెలలో కూడా ఢిల్లీ, చండీగఢ్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో భూమి భారీగా కంపించింది.

ఢిల్లీ-ఎన్‌సీఆర్ కింద ఉన్న ఆ మూడు ఫాల్ట్ లైన్స్

నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకారం ఢిల్లీ-ఎన్‌సీఆర్ నేల కింద మూడు ప్రధాన భూకంప ఫాల్ట్ లైన్లు ఉన్నాయి. భూమి అంతర్భాగంలో ఫాల్ట్ లైన్లు ఉన్న ప్రాంతాల్లోనే భూకంప కేంద్రాలు ఏర్పడతాయి. ఢిల్లీ కింద ఉన్న ఆ మూడు లైన్లు:

* ఢిల్లీ-మొరాదాబాద్ ఫాల్ట్ లైన్

* మథుర ఫాల్ట్ లైన్

* సోహ్నా ఫాల్ట్ లైన్

ఈ లైన్లలో కదలికలు సంభవించినప్పుడు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భూమి కంపిస్తూ ఉంటుంది.

అసలు భూకంపాలు ఎందుకు వస్తాయి?

భూగర్భ శాస్త్రవేత్తల ప్రకారం భూకంపాలు రావడానికి ప్రధాన కారణం భూమి లోపల ఉండే టెక్టోనిక్ ప్లేట్ల మధ్య జరిగే తీవ్రమైన కదలికలు, రాపిడి. ఇవే కాకుండా ఉల్కలు పడటం, అగ్నిపర్వతాలు బద్దలవడం, గనుల్లో జరిపే భారీ విస్ఫోటనాలు, అణు పరీక్షల వల్ల కూడా భూమి కంపిస్తూ ఉంటుంది. ఈ భూకంపాల తీవ్రతను కొలవడానికి రిక్టర్ స్కేలును ఉపయోగిస్తారు. ఢిల్లీ జోన్-IV లో ఉండటం వల్ల ఇక్కడ నిర్మించే భవనాలు భూకంపాలను తట్టుకునేలా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story