MK Stalin: గెలుపోటములు మాకు కొత్త కాదు.. సిద్ధాంత పరంగా మేం ఓడిపోలేదు: ఓటమిపై స్టాలిన్ సంచలన పోస్ట్!
MK Stalin: తమిళనాడు ఎన్నికల్లో ఓటమిపై ఎం.కే. స్టాలిన్ తొలి స్పందన. "మేం చూడని విజయం లేదు.. ఎదుర్కోని ఓటమి లేదు" అంటూ కార్యకర్తల్లో ధైర్యం నింపే ప్రయత్నం. డీఎంకే, టీవీకే మధ్య ఓట్ల తేడాపై కీలక వ్యాఖ్యలు.
MK Stalin: గెలుపోటములు మాకు కొత్త కాదు.. సిద్ధాంత పరంగా మేం ఓడిపోలేదు: ఓటమిపై స్టాలిన్ సంచలన పోస్ట్!
MK Stalin: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే (DMK) అనూహ్య పరాజయం పాలైన నేపథ్యంలో ఆ పార్టీ అధినేత ఎం.కే. స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటమి తర్వాత మొదటిసారి స్పందించిన ఆయన, పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఒక భావోద్వేగపూరితమైన పోస్ట్‌ను పంచుకున్నారు.
"డీఎంకే ఇప్పటివరకు ఆరుసార్లు అధికారంలో ఉంది. ఈ సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో మేం చూడని విజయం లేదు.. ఎదుర్కోని ఓటమి లేదు" అని స్టాలిన్ పేర్కొన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, అయితే సిద్ధాంతపరంగా ఎప్పుడూ ఓడిపోకూడదని ఆయన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఓటమికి కుంగిపోకుండా, సిద్ధాంతాలకు కట్టుబడి ప్రయాణాన్ని కొనసాగించే వారే నిజమైన పార్టీ సహచరులని కొనియాడారు.
ఈ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీకి, డీఎంకేకు మధ్య ఓట్ల శాతం తేడా కేవలం 3.52 శాతం మాత్రమేనని స్టాలిన్ గుర్తు చేశారు. "తమిళ ప్రజలు మాపై ఇప్పటికీ బలమైన నమ్మకం ఉంచారు. మాకు పడిన ప్రతి ఓటును ప్రజల నమ్మకానికి చిహ్నంగా భావిస్తున్నాను" అని ఆయన అన్నారు. అధికారంలో ఉంటే సంక్షేమ పథకాలు అందిస్తామని, విపక్షంలో ఉంటే ప్రజల డిమాండ్ల కోసం రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
73 ఏళ్ల వయసున్న స్టాలిన్ తన రాజకీయ జీవితంలో ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారు. అయితే, ఈసారి కొళత్తూర్ నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు చేతిలో 9 వేల ఓట్ల తేడాతో ఓటమి చెందడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఓటమిని గౌరవిస్తూ ఇప్పటికే ఆయన తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, లేఖను గవర్నర్‌కు పంపారు. స్టాలిన్ వ్యాఖ్యలు డీఎంకే శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపేలా ఉన్నాయి.




