Kedarnath Yatra 2026: తల్లి కోరిక కోసం.. 1,800 కిలోమీటర్లు భుజాలపై మోస్తూ కేదార్‌నాథ్‌కు!

Kedarnath Yatra 2026: కలియుగ శ్రవణ కుమారులు.. తల్లి కోరిక తీర్చడం కోసం ఇద్దరు కొడుకులు ఆమెను డోలీలో కూర్చోబెట్టుకుని, భుజాలపై మోస్తూ ఉత్తరప్రదేశ్ నుంచి కేదార్‌నాథ్ చేరుకున్నారు.

Arun Chilukuri
Published on: 25 April 2026 4:44 PM IST
Kedarnath Yatra 2026: తల్లి కోరిక కోసం.. 1,800 కిలోమీటర్లు భుజాలపై మోస్తూ కేదార్‌నాథ్‌కు!
X

Kedarnath Yatra 2026: మాతృదేవోభవ అన్న మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఇద్దరు సోదరులు. జీవితంలో ఒక్కసారైనా ఆ పరమశివుడిని కేదార్‌నాథ్‌లో దర్శించుకోవాలన్న తమ 60 ఏళ్ల తల్లి కోరికను తీర్చడం కోసం వారు చేసిన సాహసం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

యూపీకి చెందిన ధీరజ్, తేజ్‌పాల్ అనే సోదరులు తమ తల్లిని డోలీలో ఉంచి, తమ భుజాలపై మోసుకుంటూ హిమాలయాల క్లిష్టమైన మార్గాల్లో ప్రయాణించారు. ఉత్తర్‌ప్రదేశ్ నుంచి కేదార్‌నాథ్ చేరుకోవడానికి వారికి దాదాపు మూడు నెలల 24 రోజులు పట్టింది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో వారు సుమారు 1,800 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి పవిత్ర కేదార్‌నాథ్ ఆలయానికి చేరుకున్నారు.

రామాయణ కాలంలో శ్రవణ కుమారుడు తన తల్లిదండ్రులను కావిడిలో మోస్తూ తీర్థయాత్రలు చేయించిన కథను ఈ సోదరులు నేటి కాలంలో నిజం చేసి చూపించారు. హిమాలయాల్లోని గడ్డకట్టే చలిని, క్లిష్టమైన కొండ దారులను అధిగమిస్తూ వారు చూపిన పితృభక్తిని చూసి ఇతర భక్తులు అబ్బురపడుతున్నారు. "అమ్మ కోరిక కంటే మాకు ఏదీ ఎక్కువ కాదు" అని ఈ సందర్భంగా ఆ సోదరులు పేర్కొన్నారు.

ఉత్తరాఖండ్‌లో ఈ నెల 19న అక్షయ తృతీయ సందర్భంగా గంగోత్రి, యమునోత్రి ఆలయాలను తెరవడంతో చార్‌ధామ్‌ యాత్ర అధికారికంగా ప్రారంభమైంది. అప్పటి నుంచి వేలాదిమంది భక్తులు కేదార్‌నాథ్, బద్రీనాథ్ దర్శనానికి తరలివస్తున్నారు. ఈ రద్దీలోనూ ఈ ఇద్దరు సోదరుల పితృభక్తి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story