Maoist Commander Papa Rao: మావోయిస్టులకు భారీ దెబ్బ.. లొంగుబాటుకు సిద్ధమైన మోస్ట్ వాంటెడ్ నేత పాపారావు!

Maoist Commander Papa Rao: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు ఉద్యమానికి గట్టి ఎదురుదెబ్బ తగలనుంది.

Arun Chilukuri
Updated on: 24 March 2026 2:23 PM IST
Maoist Commander Papa Rao
X

Maoist Commander Papa Rao: మావోయిస్టులకు భారీ దెబ్బ.. లొంగుబాటుకు సిద్ధమైన మోస్ట్ వాంటెడ్ నేత పాపారావు!

Maoist Commander Papa Rao: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు ఉద్యమానికి గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. పశ్చిమ బస్తర్ డివిజన్ కమాండర్, మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత పాపారావు (ఎలియాస్ సున్నం చంద్రయ్య) పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం అందుతోంది. గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న ఆయన, ఇప్పుడు జనజీవన స్రవంతిలో కలిసేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

రూ. 25 లక్షల రివార్డు.. భారీ వ్యూహం

పాపారావుపై ప్రభుత్వం రూ. 25 లక్షల భారీ రివార్డు ప్రకటించింది. ఆయన లొంగుబాటుకు సంబంధించి ఇప్పటికే మధ్యవర్తులు ఛత్తీస్‌గఢ్‌లోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలోకి వెళ్లి చర్చలు జరిపినట్లు సమాచారం. సుమారు 12 నుంచి 17 మంది తన సహచరులతో కలిసి పాపారావు బీజాపూర్ ఎస్పీ ఎదుట లొంగిపోయే అవకాశం ఉంది. భద్రతా బలగాలు ఒకవైపు కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తూనే, మరోవైపు మావోయిస్టు నేతలు లొంగిపోయేలా చేస్తున్న ప్రయత్నాలు ఫలించినట్లు కనిపిస్తోంది.

నక్సలిజం అంతానికి గడువు దగ్గర పడింది: సీఎం విష్ణుదేవ్ సాయ్

ఈ పరిణామాలపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ స్పందిస్తూ కీలక ప్రకటన చేశారు. "ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా దృఢ సంకల్పంతో దేశంలో నక్సలిజంపై పోరాటం తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. దాని ప్రభావం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. పాపారావు వంటి అగ్రశ్రేణి కమాండర్లు లొంగిపోవడం ఒక సానుకూల సంకేతం. నక్సలిజం నిర్మూలనకు గడువు దగ్గర పడింది." అని ఆయన పేర్కొన్నారు.

అధికారిక ప్రకటన కోసం నిరీక్షణ

పాపారావు లొంగుబాటుపై పోలీసు ఉన్నతాధికారులు ఇంకా అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ఆయన లొంగిపోతే బస్తర్ ప్రాంతంలో మావోయిస్టుల పట్టు పూర్తిగా సడలే అవకాశం ఉందని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే అనేకమంది కీలక నేతలు ఎన్‌కౌంటర్లలో మరణించడం లేదా లొంగిపోవడంతో మావోయిస్టు పార్టీ బలహీనపడుతోంది.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story