అమ్మ కడసారి కౌగిలి.. జబల్‌పూర్ బోటు ప్రమాదంలో కన్నీరు పెట్టిస్తున్న దృశ్యం!

Narmada Tragedy: నర్మదా నది తీరాన జరిగిన ఒక ఘోర పడవ ప్రమాదం యావత్ దేశాన్ని కన్నీరు పెట్టిస్తోంది.

Srinivas Rao
Published on: 1 May 2026 4:23 PM IST
Narmada Tragedy
X

అమ్మ కడసారి కౌగిలి.. జబల్‌పూర్ బోటు ప్రమాదంలో కన్నీరు పెట్టిస్తున్న దృశ్యం!

Narmada Tragedy: నర్మదా నది తీరాన జరిగిన ఒక ఘోర పడవ ప్రమాదం యావత్ దేశాన్ని కన్నీరు పెట్టిస్తోంది. ప్రకృతి ప్రకోపానికి ఒక నిండు కుటుంబం చిన్నాభిన్నం కాగా, ప్రాణాలు పోతున్నా తన బిడ్డను రక్షించుకోవాలని ఆ తల్లి పడ్డ తపన చూసి సహాయక సిబ్బంది సైతం విలపించారు. మృత్యువు ఒడిలోనూ ఆ తల్లి తన బిడ్డను గుండెలకు హత్తుకుని కనిపించిన దృశ్యం అత్యంత హృదయవిదారకంగా ఉంది.

మృత్యు ఒడిలో మమకారం

మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్‌పూర్ జిల్లాలోని బర్గి డ్యామ్ సమీపంలో గురువారం సాయంత్రం పర్యాటక నౌక బోల్తా పడిన ఘటనలో ఒక తల్లి, ఆమె నాలుగేళ్ల కుమారుడు మృతి చెందారు. శుక్రవారం ఉదయం వీరి మృతదేహాలను వెలికితీసినప్పుడు అక్కడ కనిపించిన దృశ్యం అందరినీ కలిచివేసింది. నీటిలో మునిగిపోతున్న తరుణంలో, తన ప్రాణం పోతున్నా పర్వాలేదు కానీ తన బిడ్డ క్షేమంగా ఉండాలని ఆ తల్లి పిల్లాడిని గట్టిగా తన ఛాతీకి హత్తుకుంది . ఎంతలా అంటే, మృతదేహాలను వేరు చేయడం సహాయక సిబ్బందికి సాధ్యం కాలేనంతగా ఆ బంధం పెనవేసుకుపోయింది.

సహాయక సిబ్బంది ఆవేదన

"మృతదేహాన్ని వెలికితీసే క్రమంలో ఆమె శరీరాన్ని లాగడానికి ప్రయత్నించాం, కానీ అది కదలలేదు. లోతుగా పరిశీలిస్తే ఆమె తన రెండు చేతులతో ఒక చిన్నారిని బలంగా పట్టుకుని ఉందని అర్థమైంది. మరణం ముంచుకొస్తున్నా బిడ్డను రక్షించుకోవాలనే ఆమె తపన చూసి మా మనసులు ముక్కలయ్యాయి" అని ఒక రెస్క్యూ అధికారి కన్నీరు మున్నీరయ్యారు. ఢిల్లీకి చెందిన ఈ కుటుంబంలో తండ్రి, కుమార్తె ప్రాణాలతో బయటపడగా, భార్య , కుమారుడిని కోల్పోయిన ఆ తండ్రి రోదన వర్ణనాతీతం.

ఘోరానికి కారణం నిర్లక్ష్యమేనా?

ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 9 మంది మరణించినట్లు నిర్ధారణ అయింది. పడవ ప్రయాణానికి ముందు కనీస భద్రతా ప్రమాణాలు పాటించలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. లైఫ్ జాకెట్లు అందుబాటులో లేవని, పడవ మునిగిపోతున్న సమయంలోనే వాటిని ఇచ్చారని కొందరు వాపోయారు. సుమారు 40 నుండి 45 మంది పర్యాటకులతో ప్రయాణిస్తున్న ఈ పడవ, అకస్మాత్తుగా వచ్చిన తుపాను ధాటికి నియంత్రణ కోల్పోయి నీట మునిగింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు, భారీ వర్షం ఈ ఘోరానికి కారణమయ్యాయి.

కొనసాగుతున్న గాలింపు చర్యలు

ప్రస్తుతం ఆ పర్యాటక నౌక నీటి అడుగున 20 అడుగుల లోతులో ఇరుక్కుపోయింది. భారీ యంత్రాలు, గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. గురువారం రాత్రి 16 మందిని ప్రాణాలతో కాపాడగా, ఇంకా ఎంతమంది గల్లంతయ్యారనే విషయంలో స్పష్టత లేదు. స్థానిక గ్రామస్తులు మొదట స్పందించి తాళ్లు విసరడం వల్లే మరికొందరు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన పర్యాటక రంగంలో భద్రతా లోపాలను మరోసారి ఎత్తిచూపుతోంది.

Srinivas Rao

Srinivas Rao

శ్రీనివాస్ రావు జర్నలిజం రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం కలిగిన కంటెంట్ రైటర్, సబ్ ఎడిటర్. రాజకీయాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, లైఫ్ స్టైల్, క్రైమ్ వంటి విభిన్న అంశాల్లో లోతైన అవగాహనతో స్పష్టమైన, పాఠకులకు సులభంగా అర్థమయ్యే శైలిలో వార్తలను అందిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థలు అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏపీ7 ఏఎంలో పనిచేసి విలువైన అనుభవాన్ని సంపాదించారు. విశ్లేషణాత్మక దృక్పథంతో వార్తలకు కొత్త కోణాన్ని జోడిస్తూ పాఠకుల విశ్వాసాన్ని పొందుతున్నారు.

Next Story