New Delhi: దక్షిణాది ఎథనాల్ పరిశ్రమలను రక్షించండి!

New Delhi: రాజ్యసభ జీరో అవర్‌లో ఎథనాల్ పరిశ్రమల సంక్షోభాన్ని ప్రస్తావించిన ఎంపీ బీద మస్తాన్ రావు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 23 July 2026 10:54 AM IST
New Delhi
X

New Delhi: దక్షిణాది ఎథనాల్ పరిశ్రమలను రక్షించండి!

New Delhi: దేశ ఇంధన భద్రతకు, రైతుల ఆదాయ వృద్ధికి, పర్యావరణ పరిరక్షణకు దోహద పడుతున్న ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ (EBP) కార్యక్రమాన్ని, మరింత సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు.. వినియోగదారుల ప్రయోజనాలను కాపాడాలని, ఆంధ్రప్రదేశ్‌తో పాటు, దక్షిణాది రాష్ట్రాల ఎథనాల్ పరిశ్రమలకు ఎటువంటి అన్యాయం జరగకుండా, చర్యలు తీసుకోవాలని రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు యాదవ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

బుధవారం రాజ్యసభ జీరో అవర్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించిన ఆయన, దేశం ఇప్పటికే 20 శాతం ఎథనాల్ మిశ్రమ (E20) లక్ష్యాన్ని విజయవంతంగా సాధించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం వల్ల ముడి చమురు దిగుమతులు తగ్గడంతో పాటు విదేశీ మారకద్రవ్యం ఆదా కావడం, ఇంధన స్వావలంబన బలోపేతం కావడం, కాలుష్య ఉద్గారాలు తగ్గడం వంటి ప్రయోజనాలు దేశానికి చేకూరాయని వివరించారు.

అయితే, 2023కు ముందు తయారైన అనేక వాహనాలు E20 ఇంధనానికి పూర్తిస్థాయిలో అనుకూలంగా లేకపోవడంతో వాహన యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇంధన సామర్థ్యం 2 నుండి 5 శాతం వరకు తగ్గే అవకాశాలపై వినియోగదారుల్లో ఆందోళన ఉందని పేర్కొంటూ, పాత వాహనాలకు అనువైన ఇంధనం అందుబాటులో ఉంచడంతో పాటు E20పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

ప్రస్తుతం దేశంలోని డిస్టిలరీలు, ఎథనాల్ ఉత్పత్తి యూనిట్లు తమ ఉత్పత్తిని కేవలం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకే విక్రయించే పరిస్థితి ఉందని, కానీ OMCలు పూర్తి స్థాయిలో ఎథనాల్ కొనుగోలు చేయకపోవడంతో అనేక యూనిట్లు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని వినియోగించుకోలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. మిగులు ఎథనాల్‌ను ఔషధ, రసాయన, ఇతర పారిశ్రామిక రంగాలకు విక్రయించేందుకు తక్షణమే అనుమతి కల్పించాలని కోరారు.

ఇటీవల ప్రతిపాదిస్తున్న దేశవ్యాప్త ఎథనాల్ కేటాయింపు (Pan-India Allocation) విధానం వల్ల ఆంధ్రప్రదేశ్‌తో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో సమర్థవంతంగా పనిచేస్తున్న ఎథనాల్ పరిశ్రమలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని బీద మస్తాన్ రావు యాదవ్ హెచ్చరించారు. ఈ విధానం అమలైతే రాష్ట్రంలోని ఎథనాల్ యూనిట్ల ఉత్పత్తి తగ్గడంతో పాటు స్థానిక రైతుల నుంచి మొక్కజొన్న, బియ్యం కొనుగోళ్లు తగ్గిపోవడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడం, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలగడం, అనవసర రవాణా వ్యయాలు పెరగడం వంటి ప్రతికూల పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.

అలాగే, 2025–26 ఎథనాల్ సరఫరా సంవత్సరంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు త్రైమాసిక ఎథనాల్ కొనుగోలు టెండర్లను విడుదల చేయకపోవడంతో కొత్తగా ఏర్పాటైన ఎథనాల్ పరిశ్రమలు దాదాపు తొమ్మిది నెలలుగా కొనుగోలు ప్రక్రియలో పాల్గొనే అవకాశాన్ని కోల్పోయాయని తెలిపారు. ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్‌తో సహా అనేక రాష్ట్రాల్లోని యూనిట్లు నెలకు రూ.2 నుంచి రూ.3 కోట్ల వరకు వడ్డీ భారం భరిస్తూ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తక్షణం కింది చర్యలు చేపట్టాలని బీద మస్తాన్ రావు యాదవ్ రాజ్యసభ ద్వారా విజ్ఞప్తి చేశారు.

ప్రస్తుతం అమలులో ఉన్న ప్రాంతాల వారీ (Region-Based) ఎథనాల్ కేటాయింపు విధానాన్ని కొనసాగించాలి.

ఆంధ్రప్రదేశ్ ఎథనాల్ పరిశ్రమలకు కేటాయింపుల్లో ప్రాధాన్యతను కొనసాగించాలి.

OMCల కొనుగోలు పరిమితంగా ఉన్నప్పుడు మిగులు ఎథనాల్‌ను ఇతర చట్టబద్ధమైన పారిశ్రామిక రంగాలకు విక్రయించేందుకు అనుమతించాలి.

E20 ఇంధనంపై వినియోగదారుల ఆందోళనలను నివారించేందుకు పాత వాహనాలకు అనుకూలమైన ఇంధనం అందుబాటులో ఉంచడంతో పాటు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.

ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు త్రైమాసిక టెండర్ల విధానాన్ని వెంటనే పునరుద్ధరించి, కొత్తగా ప్రారంభమైన ఎథనాల్ యూనిట్లకు కూడా సమాన అవకాశాలు కల్పించాలి.

దేశ ఇంధన భద్రత, రైతుల సంక్షేమం, పారిశ్రామికాభివృద్ధి, వినియోగదారుల ప్రయోజనాలు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఈ అంశాలపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని బీద మస్తాన్ రావు యాదవ్ కోరారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE

Next Story