Road Accident : ఘోర ప్రమాదం.. పిక్ అప్, స్కార్పియో ఢీకొని 12 మంది కూలీల మృతి
Road Accident : మధ్యప్రదేశ్ ధార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పిక్-అప్, స్కార్పియో ఢీకొని 12 మంది కూలీలు దుర్మరణం చెందారు. 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
MP Road Accident
Road Accident : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కూలీల బతుకు ప్రయాణం అర్ధాంతరంగా రోడ్డుపైనే ముగిసిపోయింది. ధార్ జిల్లాలో బుధవారం రాత్రి జరిగిన భీకర రోడ్డు ప్రమాదంలో 12 మంది నిరుపేద కూలీలు ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. మితిమీరిన వేగం, అజాగ్రత్త పసి ప్రాణాలను, పేద కుటుంబాలను బలితీసుకున్నాయి. ఈ ఘోర ప్రమాదం స్థానికంగా పెను విషాదాన్ని నింపింది. మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లా తిర్లా పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి సుమారు 8:30 గంటల సమయంలో ఈ దారుణం జరిగింది. చిక్లియా ప్రాంతంలోని రిలయన్స్ పెట్రోల్ బంక్ సమీపంలో కూలీలతో వెళ్తున్న ఒక పిక్-అప్ వాహనం అదుపు తప్పింది. ఆ వాహనం ఎంత వేగంగా ఉందంటే.. ఒక్కసారిగా రోడ్డుకు అవతలి వైపుకు దూసుకెళ్లి, ఎదురుగా వస్తున్న వేగంగా వస్తున్న స్కార్పియోను బలంగా ఢీకొట్టింది. ఈ ధాటికి పిక్-అప్ వాహనం ముక్కలైపోగా, అందులోని కూలీలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు.
ఈ భయంకరమైన ప్రమాదంలో ఇప్పటివరకు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో పురుషులు, మహిళలతో పాటు ఇద్దరు చిన్నారులు కూడా ఉండటం అందరినీ కలిచివేస్తోంది. తమ తల్లిదండ్రులతో కలిసి పని కోసం వెళ్తున్న ఆ చిన్నారులకు అది చివరి ప్రయాణం అవుతుందని ఎవరూ ఊహించలేదు. గాయపడిన 25 మందిని తక్షణమే జిల్లా భోజ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆసుపత్రి ప్రాంగణం దద్దరిల్లిపోయింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సాధారణంగా 10 నుంచి 12 మంది మంది పట్టే పిక్-అప్ వాహనంలో సుమారు 40 నుంచి 45 మంది కూలీలను ఎక్కించడం ఈ ప్రమాద తీవ్రతకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. సామర్థ్యానికి మించి జనం ఉండటం వల్ల వాహనం అదుపు తప్పినప్పుడు డ్రైవర్ దాన్ని నియంత్రించలేకపోయాడు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పెట్రోల్ బంక్ సిబ్బంది పరుగున వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిలో 13 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, వారిని మెరుగైన చికిత్స కోసం పెద్ద నగరాలకు తరలిస్తున్నట్లు సమాచారం.
బతుకు తెరువు కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్తున్న ఈ కూలీల కలలు తిర్లా బైపాస్ వద్దే కాలిపోయాయి. రోడ్డుపై పడి ఉన్న వారి సామాన్లు, రక్తపు మరకలు ఆ ప్రమాదం ఎంత భయంకరంగా జరిగిందో సాక్ష్యం చెబుతున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నారు. కూలీల బతుకులు ఇలా రోడ్డు ప్రమాదాల్లో బుగ్గిపాలవ్వడంపై సర్వత్రా ఆవేదన వ్యక్తమవుతోంది.




