Tejasvi Surya: ఎంపీ భార్యకు రైలు ప్రయాణంలో చేదు అనుభవం..అలా చేశారంటూ ఆవేదన
Tejasvi Surya: రైలు ప్రయాణంలో తోటి ప్రయాణికుల నిర్లక్ష్యపు ప్రవర్తనపై ఎంపీ తేజస్వి సూర్య భార్య, కళాకారిణి శివశ్రీ స్కందప్రసాద్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
Tejasvi Surya: ఎంపీ భార్యకు రైలు ప్రయాణంలో చేదు అనుభవం..అలా చేశారంటూ ఆవేదన
Tejasvi Surya: ప్రయాణాలు మనసుకు ప్రశాంతతను, ఆనందాన్ని ఇవ్వాలి. కానీ, తోటి ప్రయాణికుల నిర్లక్ష్యపు ప్రవర్తన వల్ల అదే ప్రయాణం కాస్తా నరకంగా మారితే ఎలా ఉంటుంది? తాజాగా ప్రముఖ కళాకారిణి, బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య భార్య శివశ్రీ స్కందప్రసాద్‌కు రైలు ప్రయాణంలో అలాంటి చేదు అనుభవమే ఎదురైంది. బహిరంగ ప్రదేశాల్లో, ముఖ్యంగా పబ్లిక్ ట్రావెల్‌లో ప్రతి ఒక్కరూ పాటించాల్సిన పౌరస్పృహ గురించి ఆమె సోషల్ మీడియా వేదికగా నిలదీసిన తీరు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.
రైలు ప్రయాణంలో తనకు ఎదురైన సంఘటనను శివశ్రీ వివరిస్తూ.. తాను ప్రయాణిస్తున్న కోచ్‌లో సుమారు 40 మంది మధ్య వయస్కులు ఒకే బృందంగా ఉన్నారని తెలిపారు. 56 సీట్లు ఉన్న ఆ కోచ్‌లో వారు ఏకంగా ఐదు గంటల పాటు నిరంతరం గట్టిగా మాట్లాడుతూ, పెద్దగా నవ్వుతూ తోటి ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక కళాకారిగా తమకు ప్రశాంతత, నిశ్శబ్దం ఎంతో అవసరమని, మనసులో ఎన్నో ఆలోచనలు మెదులుతుంటాయని ఆమె పేర్కొన్నారు. కానీ ఆ బృందం ప్రవర్తించిన తీరు వల్ల ఆ ప్రశాంతత పూర్తిగా కరువైందని తెలిపారు.
పరిస్థితిని భరించలేక వేరే కోచ్‌లో సీటు మార్చమని శివశ్రీ టీటీఈని కోరారు. అయితే రైలు పూర్తిగా నిండిపోవడంతో సీటు మార్చడం సాధ్యం కాలేదు. దీంతో అప్పట్లో అదే కోచ్‌లో వేరే సీటుకు మారాల్సి వచ్చింది. అయినా వారి ప్రవర్తనలో మార్పు రాకపోగా, ఆ బృందంలోని ఎనిమిది మంది సభ్యులు కోచ్‌లోనే 'యూనో' ఆట ప్రారంభించారు. విసిగిపోయిన శివశ్రీ మరోసారి టీటీఈని ఆశ్రయించగా, ఆయన జోక్యం చేసుకుని ఆ ఆటను ఆపించారు. అయితే ఆట నిలిపివేసినప్పటికీ, కొద్దిసేపటికే ఆ బృందం మళ్లీ టీటీఈతోనే కబుర్లు చెబుతూ సందడి చేయడం కొనసాగించారు.
ఈ సంఘటనను ముగస్తూ శివశ్రీ ఒక బలమైన ప్రశ్నను లేవనెత్తారు. బహిరంగ ప్రదేశాల్లో తోటి ప్రయాణికుల పట్ల బాధ్యతాయుతమైన ప్రవర్తన ఎప్పుడు మెరుగుపడుతుంది? అని ప్రశ్నించారు. రైలు లేదా బస్సు ఏదైనా సరే, నలుగురు కూర్చునే చోట ఇతరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రయాణించడం ప్రతి ఒక్కరి కనీస బాధ్యత అని ఆమె హితవు పలికారు. రైళ్లలో ప్రయాణించేటప్పుడు తోటి ప్రయాణికుల వ్యక్తిగత స్థలాన్ని , ప్రశాంతతను గౌరవించాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి అందరికీ గుర్తుచేస్తోంది.




