నల్లగా ఉన్నాడని భర్తను వదిలించుకుంది.. దొంగతనం నాటకమాడి బుక్కైంది!
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దారుణం.. భర్త నల్లగా ఉన్నాడన్న కారణంతో భార్య ప్రియుడితో కలిసి హత్య చేయించింది. లక్ష రూపాయలు సుపారీ ఇచ్చి నిద్రలోనే భర్తను చంపించిన ప్రియాంకను పోలీసులు అరెస్ట్ చేశారు.
నల్లగా ఉన్నాడని భర్తను వదిలించుకుంది.. దొంగతనం నాటకమాడి బుక్కైంది!
Madhya Pradesh: భర్త రంగు తక్కువగా ఉన్నాడనే నెపంతో ఒక భార్య ప్రియుడితో కలిసి అతడిని దారుణంగా హత్య చేయించిన సంఘటన మధ్యప్రదేశ్‌లోని ధర్ జిల్లాలో వెలుగుచూసింది. ఈ కేసులో పోలీసులు భార్యతో పాటు ఆమె ప్రియుడిని కూడా అరెస్ట్ చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. 28 ఏళ్ల దేవ్ కృష్ణ పురోహిత్‌కు, ప్రియాంక (25) అనే యువతితో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే, భర్త నల్లగా ఉన్నాడంటూ ప్రియాంక నిత్యం గొడవ పడేది. "నువ్వు నల్లగా ఉన్నావు.. నిన్ను పెళ్లి చేసుకోవడం నా కర్మ" అంటూ తరచూ అతడిని వేధించేది. ఈ క్రమంలోనే రాజ్‌ఘర్‌కు చెందిన కమ్‌లేశ్ పురోహిత్ అనే వ్యక్తితో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంది.
తమ బంధానికి అడ్డుగా ఉన్న భర్తను వదిలించుకోవాలని ప్రియాంక, కమ్‌లేశ్ ప్లాన్ వేశారు. సురేంద్ర భక్తి అనే కిరాయి హంతకుడికి రూ. 1 లక్ష ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అడ్వాన్స్‌గా రూ. 50 వేలు చెల్లించారు. ఏప్రిల్ 7వ తేదీన సురేంద్ర భక్తి గ్యాంగ్.. దేవ్ కృష్ణ నిద్రపోతున్న సమయంలో ఇంట్లోకి చొరబడి పదునైన ఆయుధాలతో అతడిని చంపేశారు.
హత్య జరిగిన తర్వాత ప్రియాంక పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చింది. దొంగలు వచ్చి తన భర్తను చంపి, నగలు దోచుకెళ్లారని నమ్మబలికింది. అయితే పోలీసులు లోతుగా విచారించగా ఆమె మాటల్లో వైరుధ్యం కనిపించింది. ఇంట్లో సోదాలు చేయగా.. ఆమె పోయాయని చెప్పిన నగలు అక్కడే దొరికాయి. ఫోన్ డేటా పరిశీలించడంతో కమ్‌లేశ్‌తో ఉన్న అక్రమ సంబంధం బయటపడింది. పోలీసులు ప్రియాంక, కమ్‌లేశ్‌లను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. పరారీలో ఉన్న కిరాయి హంతకుడు సురేంద్ర కోసం పోలీసులు గాలిస్తున్నారు.




