MS Subbulakshmi Jayanti : ప్రతీ ఇంట్లో సుప్రభాతం...గాన సరస్వతి ఎంఎస్ సుబ్బలక్ష్మి మాధుర్యం
గాన సరస్వతి ఎంఎస్ సుబ్బలక్ష్మి జీవితం, సంగీత ప్రస్థానం, వేంకటేశ్వర సుప్రభాతం, అంతర్జాతీయ ఖ్యాతి, భారతరత్న వంటి విశేషాలను తెలుసుకుందాం.
MS Subbulakshmi Jayanti : తెల్లవారుజామున ఇల్లు నిశ్శబ్దంగా ఉంటుంది. అప్పుడే ఎక్కడో ఒకచోట నుంచి “కౌసల్యా సుప్రజా రామా...” అంటూ వినిపించే మధుర స్వరం వాతావరణాన్నే మార్చేస్తుంది. ఆ గాత్రం ఎంఎస్ సుబ్బలక్ష్మిదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం చాలామందికి ఉండదు. ఆమె స్వరం వింటే చాలు.. ఆ గాన మాధుర్యం వెంటనే గుర్తొస్తుంది. భక్తి గీతమైనా, కీర్తనైనా, శాస్త్రీయ సంగీత కచేరీ అయినా తన స్వరంతో ప్రత్యేకమైన అనుభూతిని పంచిన గాయనిగా ఎంఎస్ సుబ్బలక్ష్మి భారతీయ సంగీత చరిత్రలో చెరగని ముద్ర వేశారు. మధురై షణ్ముఖవడివు సుబ్బలక్ష్మి 1916 సెప్టెంబర్ 16న మధురైలో జన్మించారు. చిన్ననాటి పేరు కుంజమ్మ. సంగీతం ఆమెకు కొత్త ప్రపంచం కాదు. అమ్మమ్మ అక్కమ్మాళ్ వయోలిన్ విద్వాంసురాలు కాగా, తల్లి షణ్ముఖవడివు వీణా విద్వాంసురాలు. ఇంట్లో ఎప్పుడూ సంగీత చర్చలు, సాధనలు జరుగుతుండటంతో కుంజమ్మకు బాల్యం నుంచే సంగీతంపై సహజమైన ఆసక్తి ఏర్పడింది.
పదేళ్లకే వేదికపై ప్రతిభ
చిన్న వయసులోనే ఆమె గాత్ర ప్రతిభ అందరినీ ఆకట్టుకుంది. పదేళ్ల వయసులోనే వేదికపై పాడిన బాలికగా ప్రారంభమైన ప్రయాణం.. తర్వాత ప్రపంచంలోని ప్రతిష్ఠాత్మక సంగీత వేదికల వరకు వెళ్లింది. శ్రుతిపై పట్టు, లయపై అవగాహన, పదాలను స్పష్టంగా పలికించే తీరు ఆమె గానానికి ప్రత్యేకతను తీసుకొచ్చాయి. ఆమె సంగీత ప్రయాణంలో పలువురు ప్రముఖుల శిక్షణ కీలకంగా నిలిచింది. పాపనాశం శివన్, ముసిరి సుబ్రమణ్య అయ్యర్, జి.ఎన్. బాలసుబ్రమణ్యం వంటి సంగీత విద్వాంసుల వద్ద ఆమె అభ్యసించారు. హిందుస్థానీ సంగీతంలోని కొన్ని అంశాలను కూడా నేర్చుకోవడంతో ఆమె గాన పరిధి మరింత విస్తరించింది.
సినిమాల నుంచి జాతీయ స్థాయికి
ఎంఎస్ సుబ్బలక్ష్మి కేవలం కచేరీ గాయనిగా మాత్రమే కాకుండా సినిమాల్లోనూ కనిపించారు. ‘సేవాసదనం’, ‘సావిత్రి’, ‘శాకుంతలై’ వంటి చిత్రాల్లో నటించారు. అయితే 1945లో వచ్చిన ‘మీరా’ సినిమా ఆమెకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. అనంతరం హిందీలోనూ ‘మీరా’ రూపొందడంతో ఆమె గాత్రం, నటన ఉత్తర భారత ప్రేక్షకులకు కూడా చేరువయ్యాయి. 1940లో టి. సదాశివంతో వివాహం ఆమె జీవితంలో మరో కీలక మలుపు. సామాజిక సేవా కార్యక్రమాల కోసం ఆమె దేశవ్యాప్తంగా కచేరీలు నిర్వహించారు. మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, సరోజినీ నాయుడు, రాజేంద్ర ప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి ప్రముఖులు ఆమె సంగీతాన్ని అభిమానించారు.
ప్రపంచ వేదికపై భారతీయ సంగీత స్వరం
ఎంఎస్ సుబ్బలక్ష్మి ప్రతిభకు అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు లభించింది. 1966లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఆమె ప్రదర్శన ఇవ్వడం భారతీయ శాస్త్రీయ సంగీతానికి ప్రపంచ వేదికపై దక్కిన అరుదైన గౌరవంగా నిలిచింది. ఆమెకు లభించిన పురస్కారాల్లో రామన్ మెగసేసే అవార్డు, భారతరత్న అత్యంత విశిష్టమైనవి. భారతరత్న అందుకున్న తొలి సంగీత విద్వాంసురాలిగా ఆమె పేరు చరిత్రలో నిలిచిపోయింది. అయితే ఎంఎస్ సుబ్బలక్ష్మి గొప్పతనం కేవలం పురస్కారాల్లోనే లేదు. సంగీత కచేరీల ద్వారా వచ్చిన ఆదాయంలో గణనీయమైన మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు అందించారు. ఆసుపత్రులు, పాఠశాలలు, సామాజిక సంస్థలకు ఆమె చేసిన సహాయం ఆమె వ్యక్తిత్వంలోని మరో కోణాన్ని చూపించింది. ఎన్నో సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలు చేపట్టిన ఎంఎస్ సుబ్బలక్ష్మి 2004 డిసెంబర్ 11న, 88 ఏళ్ల వయసులో కన్నుమూశారు. కానీ ఆమె స్వరం మాత్రం ఆగిపోలేదు. ‘భజగోవిందం’, ‘విష్ణు సహస్రనామం’, వేంకటేశ్వర సుప్రభాతం వంటి గానాలు నేటికీ అనేక ఇళ్లలో ఉదయాన్ని పలకరిస్తూనే ఉన్నాయి. తరాలు మారినా, సంగీత అభిరుచులు మారినా.. ఎంఎస్ సుబ్బలక్ష్మి గాత్రానికి ఉన్న ఆ ప్రత్యేకమైన ఆకర్షణ మాత్రం తగ్గలేదు. ఆమె పాడిన పాటలు వినిపిస్తే అది కేవలం సంగీతం కాదు.. ఒక తరం జ్ఞాపకాలు, భక్తి, భారతీయ సంగీత సంప్రదాయం ఒకేసారి గుర్తుకొచ్చే అనుభూతి.




