Mumbai: ఎయిర్‌పోర్ట్‌లో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.. ఒకే రన్‌వేపై ఎదురెదురుగా రెండు విమానాలు!

Mumbai: ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర విమాన ప్రమాదం తప్పింది.

Arun Chilukuri
Published on: 8 July 2026 10:46 AM IST
Mumbai
X

Mumbai: ఎయిర్‌పోర్ట్‌లో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.. ఒకే రన్‌వేపై ఎదురెదురుగా రెండు విమానాలు!

Mumbai: ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం రాత్రి ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. ఒకే రన్‌వేపైకి ఎయిర్‌ ఇండియా (Air India), ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ (Air India Express) విమానాలు ఎదురెదురుగా వచ్చాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC), ఎయిరిండియా పైలట్‌ అత్యంత చాకచక్యంగా, సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలవకుండా సురక్షితంగా బయటపడ్డారు.

విమానాశ్రయ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో సిలిగుడి నుంచి ముంబయి వచ్చిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం నిర్దేశిత రన్‌వేపై సురక్షితంగా ల్యాండ్‌ అయ్యింది. అయితే, అదే సమయంలో ముంబయి నుంచి దిల్లీకి బయలుదేరడానికి సిద్ధమైన ఎయిర్ ఇండియా విమానం రన్‌వేపై టేకాఫ్‌ కొరకు వేగంగా దూసుకువచ్చింది. ఒకే రన్‌వేపై ఒక విమానం ల్యాండ్ అవ్వడం, మరో విమానం టేకాఫ్‌కు సిద్ధమవడంతో రెండు విమానాలు ఎదురెదురుగా ముఖాముఖి వచ్చే పరిస్థితి ఏర్పడింది.

రన్‌వేపై ఏర్పడిన ఈ తీవ్ర గందరగోళాన్ని రడార్ ద్వారా గమనించిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ATC) అత్యంత వేగంగా స్పందించారు. టేకాఫ్‌కు సిద్ధమవుతున్న ఎయిర్ ఇండియా విమాన పైలట్‌ను వెంటనే రేడియో సిగ్నల్స్ ద్వారా అప్రమత్తం చేశారు. దీంతో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో రెండు విమానాలు కేవలం కొన్ని అడుగుల దూరంలోనే ఎదురెదురుగా నిలిచిపోయాయి.

ప్రమాదం తప్పడంతో విమానాశ్రయ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. రన్‌వేపై నిలిచిపోయిన రెండు విమానాల్లోని ప్రయాణికులను అధికారులు అత్యవసరంగా, సురక్షితంగా కిందకు దించారు. పరీక్షలు నిర్వహించడానికి ఎయిరిండియా విమానాన్ని వెంటనే టెక్నికల్ బేస్‌కు తరలించారు. కాగా దిల్లీ వెళ్లాల్సిన ప్రయాణికులకు ఎయిర్‌లైన్స్ యాజమాన్యం ప్రత్యామ్నాయ విమాన ఏర్పాట్లు చేసింది. ఒకే సమయంలో ఒకే రన్‌వేపైకి రెండు విమానాలకు ఎలా అనుమతులు లభించాయనే సాంకేతిక లోపంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) తీవ్రంగా స్పందిస్తూ ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story