Ganesh Idol Collapse : ఊరేగింపులో ఒక్కసారిగా కూలిన గణపతి.. ఇద్దరు మృతి..

Ganesh Idol Collapse : వినాయక చవితి పండుగ సమయాన ముంబై నగరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 'భులేశ్వరచ రాజా' గణపతి విగ్రహ ఆగమన ఊరేగింపులో

G Krishna
Published on: 23 Aug 2026 11:44 AM IST
Ganesh Agaman
X

Ganesh Agaman

Ganesh Idol Collapse : వినాయక చవితి పండుగ సమయాన ముంబై నగరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 'భులేశ్వరచ రాజా' గణపతి విగ్రహ ఆగమన ఊరేగింపులో ఊహించని ప్రమాదం జరిగింది. భారీగా భక్తులు ఊరేగింపుగా వస్తుండగా, ఒక్కసారిగా 22 అడుగుల ఎత్తైన విగ్రహం భక్తులపై కూలిపోయింది. ఈ భయానక ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే నలిగిపోయి ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు చిన్నారులతో సహా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

నట్ బోల్టులు వదులవ్వడమే కారణమా?

దక్షిణ ముంబైలో రాత్రి 10:00 నుంచి 10:30 గంటల మధ్య ఈ ఘోర ఉదంతం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే ముంబై ఫైర్ బ్రిగేడ్, బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) అధికారులు , పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. విగ్రహం అమర్చిన ఐరన్ ఫ్రేమ్‌లో నట్లు, బోల్టులు వదులుగా ఉండటం వల్లే విగ్రహం సమతుల్యత కోల్పోయి కిందపడిపోయినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సుమారు 3,000 కిలోల బరువున్న ఈ భారీ విగ్రహం పడటంతో అక్కడున్న వారు తీవ్రంగా గాయపడ్డారు.

మృతుల వివరాలు.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు

క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించగా, అప్పటికే ఇద్దరు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతులను సంకేత్ నవ్షే, బ్రజేష్ హేమంత్ జోషిగా గుర్తించారు. ఇక ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వైభవ్ ఘెనంద్ (38), పవన్ చౌరాసియా (25), లావణ్య గణేర్ (5), దివ్య గణేర్ (7), కునాల్ కాశిద్ (26) అనే ఐదుగురు ప్రస్తుతం వేర్వేరు ఆసుపత్రులలో అత్యవసర చికిత్స పొందుతున్నారు.

కళ్లముందే ఘోరం.. ఆవేదన వ్యక్తం చేసిన ప్రత్యక్ష సాక్షులు

ఈ ఘటన జరిగిన తీరును వివరిస్తూ ఒక ప్రత్యక్ష సాక్షి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. "ముందుగా విగ్రహం చేయి విరిగిపోయింది, నా మనవడు విగ్రహం కాళ్ల దగ్గర కూర్చుని ఉన్నాడు, సమయానికి అతడు పక్కకు తప్పుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. కానీ మా బిల్డింగ్‌లో ఉండే బ్రజేష్ జోషి విగ్రహం కింద నలిగిపోయాడు. నా కొడుకు, ఇతరులు కలిసి అతడిని చాలా కష్టపడి బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు, కానీ అప్పటికే అతడు చనిపోయాడని డాక్టర్లు చెప్పారు" అని ఆయన కన్నీటిపర్యంతమయ్యారు. రోడ్లు సరిగ్గా లేకపోవడం, గుంతల వల్ల కూడా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆగమన వేడుకల్లో భాగంగా ప్రజలంతా డ్యాన్సులు చేస్తూ ఆనందోత్సాహాల మధ్య ఊరేగింపుగా వెళ్తుండగా క్షణాల్లో ఈ విషాదం జరిగిపోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్ర వ్యాప్తంగా ఎంతో వైభవంగా జరుపుకునే గణేష్ ఉత్సవాల వేళ ఈ ఘోర ఉదంతం జరగడం నగరంలో తీవ్ర శోకాన్ని నింపింది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story