Mumbai Heavy Rains: ముంబయిని ముంచెత్తిన భారీ వర్షాలు.. ఐఎండీ రెడ్ అలర్ట్!

Mumbai Heavy Rains: మహారాష్ట్ర రాజధాని ముంబయితో పాటు థానే, పాల్ఘర్‌లను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేయడంతో అధికారులు పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు.

Arun Chilukuri
Updated on: 24 Jun 2026 11:38 AM IST
Mumbai Heavy Rains
X

Mumbai Heavy Rains: ముంబయిని ముంచెత్తిన భారీ వర్షాలు.. ఐఎండీ రెడ్ అలర్ట్!

Mumbai Heavy Rains: మహారాష్ట్ర రాజధాని ముంబయితో పాటు పరిసర జిల్లాలైన థానే, పాల్ఘర్‌లను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పలు లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు జలదిగ్బంధం కావడంతో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) ముంబయిలోని పలు ప్రాంతాలకు 'రెడ్ అలర్ట్' జారీ చేసింది. బుధవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

భారీ వర్షాల కారణంగా థానే-పుణె మధ్య అత్యంత కీలకమైన రవాణా మార్గమైన 'మాల్షేజ్ ఘాట్'లో ఘోర ప్రమాదం తప్పింది. రహదారిపై పెద్ద ఎత్తున చెట్లు, కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఈ మార్గంలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రహదారిని పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మరోవైపు, అప్రమత్తమైన ప్రభుత్వం వర్ష ప్రభావిత ప్రాంతాల్లోని పాఠశాలలు, కళాశాలలను తక్షణమే మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది.

నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుండటంతో అంధేరి ప్రాంతంలోని సబ్‌వే (అండర్‌పాస్) పూర్తిగా నీట మునిగింది. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో ముందస్తు రక్షణ చర్యగా బ్రిహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఈ అండర్‌పాస్‌లో వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేసింది.

మరోవైపు, ప్రతికూల వాతావరణం కారణంగా విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది. ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నడిచే పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు ఎయిర్‌పోర్ట్ అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు తమ విమాన సమయాలను సంబంధిత ఎయిర్‌లైన్స్ వెబ్‌సైట్లలో సరిచూసుకున్న తర్వాతే విమానాశ్రయానికి బయలుదేరాలని సూచించారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story