Mumbai Rains: ముంబై టు పుణె రైళ్లు రద్దు.. థానే, పాల్‌ఘర్ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు!

Mumbai Rains: దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. మంఖుర్డులో ఇల్లు కూలి ఆరుగురు మృతి చెందగా.. పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.

Arun Chilukuri
Updated on: 6 July 2026 11:41 AM IST
Mumbai Rains
X

Mumbai Rains: ముంబై టు పుణె రైళ్లు రద్దు.. థానే, పాల్‌ఘర్ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు!

Mumbai Rains: దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరాన్ని భారీ వర్షాలు వణికించాయి. గత కొన్ని గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న రికార్డు స్థాయి వర్షాల కారణంగా నగరంలో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. కేవలం 12 గంటల వ్యవధిలోనే నగరంలో ఏకంగా 200 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. ఈ వర్షాల ధాటికి నగరంలో ఒక ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

భారీ వర్షాల ధాటికి మంఖుర్డు ప్రాంతంలో ఒక మూడు అంతస్తుల చాల్‌లోని ఒక భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో పక్కనే ఉన్న మరో రెండు మూడు ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. శిథిలాల కింద చిక్కుకుని నలుగురు మహిళలతో సహా మొత్తం ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్‌లు, సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగి శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీశాయి.

తీవ్ర వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అధికారులు ముంబై-పూణె మధ్య నడిచే రైల్వే సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేశారు. రైల్వే స్టేషన్లలో మరియు పట్టాలపై నీరు నిలిచిపోవడంతో లోకల్ రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్లన్నీ చెరువులను తలపించడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ముంబైతో పాటు తీవ్ర ప్రభావితమైన థానే, పాల్‌ఘర్ జిల్లాల్లోని అన్ని విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు.

వాతావరణ శాఖ (IMD) ముంబైతో పాటు రాయగడ్, థానే, పాల్ఘర్, రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాల్లో అత్యంత భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ 'రెడ్ అలర్ట్' జారీ చేసింది. అలాగే మధ్య మహారాష్ట్రలోని సతారా, పుణె, నాసిక్ ఘాట్ ప్రాంతాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రానున్న 24 గంటల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

లోతట్టు ప్రాంతాలు మరియు ఘాట్ రోడ్లలో ప్రయాణించే వారు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లో స్థానిక ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ సూచించింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story