Viral: జీతం కట్ చేయమంటే.. ఏకంగా పెయిడ్ లీవ్‌ ఇచ్చి మరీ ఎంజాయ్ చేయమన్నాడు.. ఎందుకంటే!

Viral: పనిలో వెనకబడిన తన ఉద్యోగిని జీతంలో కోత కోయమని కోరితే, ఒక ముంబై స్టార్టప్ ఫౌండర్ ఆమెను ఏకంగా పెయిడ్ లీవ్‌లో పంపి అందరినీ ఆశ్చర్యపరిచారు.

Ravi
By Ravi
Published on: 22 July 2026 8:03 AM IST
Viral
X

Viral: జీతం కట్ చేయమంటే.. ఏకంగా పెయిడ్ లీవ్‌ ఇచ్చి మరీ ఎంజాయ్ చేయమన్నాడు.. ఎందుకంటే!

Viral: కార్పొరేట్ రంగంలో ఉద్యోగుల పనితీరు సరిగ్గా లేకపోతే యాజమాన్యాలు సాధారణంగా జీతాలు కోయడం లేదా హెచ్చరికలు జారీ చేయడం చేస్తుంటాయి. అయితే, దీనికి భిన్నంగా ఒక ముంబై స్టార్టప్ ఫౌండర్ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం నెటిజన్ల మనసులను గెలుచుకుంటోంది.

బ్లూ లాబ్‌స్టర్ మీడియా వ్యవస్థాపకుడు ధృవ్ ముఖర్జీ తన సంస్థలో కంటెంట్ ఆపరేషన్స్ లీడ్‌గా పనిచేస్తున్న ఆర్య అనే ఉద్యోగిని విషయంలో ఈ వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. గత నెలలో ఆమె పనితీరులో నాణ్యత తగ్గిపోవడం, డెడ్‌లైన్లు దాటిపోవడం వంటి సమస్యలు తలెత్తాయి. దీనిపై ఆమెను ప్రశ్నించగా, వ్యక్తిగత సమస్యల వల్ల సరిగ్గా దృష్టి పెట్టలేకపోయానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

తన వైఫల్యానికి చింతిస్తూ తన జీతంలో కొంత భాగాన్ని జరిమానాగా కోయమని ఆమె స్వయంగా ఫౌండర్‌ను కోరింది. కానీ ధృవ్ ముఖర్జీ మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించారు. ఉద్యోగుల వెనుక ఉన్న అసలు కారణాలను అర్థం చేసుకోవాలని భావించిన ఆయన, ఆమెను జీతం కట్ చేయడానికి బదులుగా పూర్తిగా కంపెనీ ఖర్చులతో 3 రోజుల పాటు ఎయిర్‌బీఎన్‌బీ స్టే కోసం పంపించారు. కొత్త వాతావరణంలో రెండు రోజులు ప్రశాంతంగా పని చేసుకోవడానికి, చివరి రోజు విశ్రాంతి తీసుకోవడానికి ఈ లీవ్‌ ఉపయోగపడింది. అంతేకాకుండా ఆమె ఇంటికి సమీపంలోనే ఒక కో-వర్కింగ్ స్పేస్‌లో ప్రత్యేకంగా డెస్క్‌ను కూడా ఏర్పాటు చేయించారు.

కాగా, ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను ధృవ్ ముఖర్జీ లింక్డ్ఇన్ వేదికగా పంచుకోగా, ఆ పోస్ట్ క్షణాల్లో వైరల్ అయింది. "ఉద్యోగులు ముందుగా మనుషులు, ఆ తర్వాతే నిపుణులు" అని ఆయన పేర్కొన్న తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కష్ట సమయంలో ఒక యజమాని చూపించే సానుభూతి సంస్థ పట్ల ఉద్యోగులకు నిజమైన విధేయతను పెంచుతుందని పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఈ మానవీయ కోణంతో కూడిన నాయకత్వం కార్పొరేట్ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story