Mumbai: సాధారణ మహిళ తెగింపు.. 15 వేల మంది ప్రాణాలు కాపాడిన ఒకే ఒక్క అనుమానం!

Mumbai: ముంబయిలో మొహర్రం పర్వదినాన 15,000 మందిని విషప్రయోగంతో చంపాలనే ఘోర కుట్ర భగ్నమైంది.

Arun Chilukuri
Published on: 28 Jun 2026 2:14 PM IST
Mumbai:
X

Mumbai: సాధారణ మహిళ తెగింపు.. 15 వేల మంది ప్రాణాలు కాపాడిన ఒకే ఒక్క అనుమానం!

Mumbai: మొహర్రం పర్వదినం వేళ దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కలకలం రేపిన 15,000 మందిపై విషప్రయోగం కుట్ర ఓ సామాన్య మహిళ చూపిన అప్రమత్తతతో భగ్నమైంది. జన సమూహమే లక్ష్యంగా ఎలుకల మందు (జింక్ పాస్ఫేట్) నింపిన వేలాది క్యాప్సూల్స్‌ను పంపిణీ చేస్తున్న ఉన్నత విద్యావంతుడైన నిందితుడు ఫయాజ్ ప్రేమ్‌జీని పోలీసులు సకాలంలో అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడు ఫయాజ్ ఈ విషపూరిత క్యాప్సూల్స్‌ను ముఖ్యంగా మహిళలు, చిన్నారులను టార్గెట్ చేస్తూ పంపిణీ చేయాలని ప్లాన్ చేశాడు. తొలుత వీటిని పెయిన్ కిల్లర్స్ అని, ఇమ్యూనిటీ బూస్టర్లని నమ్మించి కొందరికి ఇచ్చాడు. ఆ తర్వాత ‘చాక్లెట్లు’ అని చెబుతూ జనాలపైకి విసిరాడు. రేయ్ రోడ్ రహ్మతాబాద్ శ్మశానం వద్ద అతడు ఉచితంగా వీటిని పంపిణీ చేస్తుండగా.. అక్కడే ఉన్న ఓ మహిళకు అనుమానం వచ్చింది. ఆమె ఒక క్యాప్సూల్‌ను తెరిచి చూడగా అందులో వింత పౌడర్ కనిపించింది. దీంతో ఆమె వెంటనే బైకుల్లా పోలీసులకు సమాచారం అందించింది.

సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని ఫయాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి ఏకంగా 14,900 విషపు క్యాప్సూల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే, అప్పటికే ఆ క్యాప్సూల్స్ తిన్న 11 మంది తీవ్ర అస్వస్థతకు గురవగా.. వారిని ఆసుపత్రికి తరలించి ప్రాణాపాయం నుండి కాపాడారు. దాదాపు 15,000 మందిని చంపాలనే లక్ష్యంతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు నిందితుడు పోలీసుల విచారణలో అంగీకరించినట్లు తెలుస్తోంది.

నిందితుడు వాడిన ‘జింక్ పాస్ఫేట్’ మనిషి శరీరంలోకి వెళ్లగానే కడుపులోని ఆమ్లాలతో (Acids) చర్య జరిపి ప్రాణాంతకమైన పాస్ఫేట్ గ్యాస్‌ను విడుదల చేస్తుంది. ఇది గుండె, ఊపిరితిత్తులు, లివర్, మెదడును పూర్తిగా దెబ్బతీస్తుంది. ఈ విషానికి ఎలాంటి యాంటీ డోట్ (విరుగుడు) కూడా లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. నిందితుడు ఒక గెస్ట్ హౌస్‌లో బస చేసి, దాదాపు 50 కిలోల జింక్ పాస్ఫేట్ కొనుగోలు చేసి సొంతంగా ఈ క్యాప్సూల్స్ నింపినట్లు పోలీసులు గుర్తించారు.

నిందితుడు ఫయాజ్ ప్రేమ్‌జీ ఉన్నత విద్యావంతుడు కావడం గమనార్హం. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (BBA) పూర్తి చేసిన అతను, కొన్నాళ్లు తన తండ్రి ఫ్యాక్టరీలో పని చేశాడు. ఆ తర్వాత విదేశాలకు వెళ్లి ఇరాన్, ఇరాక్ దేశాల్లో నివసించాడు. ప్రస్తుతం అతని కుటుంబం ఇరాన్‌లోనే ఉంటున్నట్లు సమాచారం. ఇంతటి ఘోర కుట్ర వెనుక ఏదైనా ఉగ్రకోణం లేదా అంతర్జాతీయ శక్తుల హస్తం ఉందా అనే కోణంలో ముంబయి పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story