Child Safety : పుట్టినరోజు వేడుకల్లో ఘోరం.. కేకుతో పాటు పిన్నులు మింగేసిన చిన్నారి

Child Safety : మహారాష్ట్రలోని ఠాణెలో బేకరీ నిర్లక్ష్యం వల్ల మూడేళ్ల బాలుడు బర్త్‌డే కేకులోని మెటల్ పిన్నులను మింగేసాడు.

CR Reddy
Published on: 11 Jun 2026 7:38 AM IST
Child Safety
X

Child Safety

Child Safety : చిన్న పిల్లల పుట్టినరోజు వేడుకలు అంటే ఆ ఇంట్లో ఎంతో సందడి ఉంటుంది. బంధుమిత్రుల మధ్య కేక్ కట్ చేసి, ఆనందంగా గడపాలని ప్రతి తల్లిదండ్రూ కోరుకుంటారు. కానీ మహారాష్ట్రలోని ఠాణె జిల్లాకు చెందిన ఒక కుటుంబానికి మాత్రం ఈ వేడుక ఒక పీడకలగా మారింది. కేవలం ఒక బేకరీ నిర్వాహకులు చేసిన చిన్న పొరపాటు, నిర్లక్ష్యం కారణంగా ఒక మూడేళ్ల చిన్నారి ప్రాణాల మీదికి తెచ్చింది. కేకు ముక్కతో పాటు లోహపు పిన్నులు కడుపులోకి వెళ్లడంతో ఆ కుటుంబం కొన్ని గంటల పాటు నరకయాతన అనుభవించింది.

ఠాణె నగరానికి చెందిన రేయాన్ష్ అనే మూడేళ్ల బాలుడి పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యులు ఘనంగా ప్లాన్ చేశారు. అందుకోసం స్థానిక బేకరీలో బాబుకు ఇష్టమైన బౌలింగ్ థీమ్ కేకును ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చారు. అనుకున్నట్లుగానే బంధువులు, స్నేహితుల సమక్షంలో రేయాన్ష్‌తో కేక్ కట్ చేయించారు. ఆ తర్వాత ఎంతో ఇష్టంగా బాబుకు కేకు తినిపించారు. అయితే, అక్కడే ఉన్న మిగతా పిల్లలు కూడా కేకు తింటుండగా.. అందులో కొన్ని ఇనుప పిన్నులు ఉండటాన్ని గమనించి గట్టిగా కేకలు వేశారు. అది చూసి రేయాన్ష్ తల్లిదండ్రులు ఒక్కసారిగా నివ్వెరపోయారు.

రేయాన్ష్ అప్పటికే రెండు కేకు ముక్కలను తినేయడంతో, ఆ కేకులో ఉన్న రెండు మెటల్ పిన్నులు కూడా బాబు పొట్టలోకి వెళ్లిపోయాయని తల్లిదండ్రులు గుర్తించారు. దీనితో తీవ్ర భయాందోళనలకు గురైన కుటుంబ సభ్యులు వెంటనే బాలుడిని స్థానిక అత్యవసర ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వైద్యులు బాలుడికి వెంటనే ఎక్స్‌రే పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో బాబు పొట్టలో రెండు లోహపు పిన్నులు ఉన్నట్లు స్పష్టంగా కనిపించింది. అయితే వైద్యులు ఆందోళన చెందవద్దని, మోషన్ ద్వారా అవి సహజ సిద్ధంగా బయటకు వచ్చేస్తాయని చెప్పడంతో తల్లిదండ్రులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

డాక్టర్లు చెప్పినట్లుగానే ఆ మరుసటి రోజు ఉదయం బాబు మలవిసర్జన చేసిన సమయంలో ఆ రెండు మెటల్ పిన్నులు శరీరం నుంచి సురక్షితంగా బయటకు వచ్చేసాయి. దీనితో ఆ కుటుంబం పెద్ద గండం నుంచి గట్టెక్కినట్లయింది. ఈ భయంకరమైన అనుభవాన్ని, బేకరీల నిర్లక్ష్యాన్ని ఇతరులకు వివరించి అప్రమత్తం చేయాలని బాలుడి తల్లి నిర్ణయించుకుంది. ఆసుపత్రి ఎక్స్‌రే రిపోర్టులు, కేకు అలంకరణకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్/ఎక్స్‎లో షేర్ చేయడంతో అది కాస్తా క్షణాల్లో వైరల్‌గా మారింది.

"నా కొడుకు రేయాన్ష్‌కు ఇష్టమైన బౌలింగ్ కేకును ఆర్డర్ చేశాం. దానిపై అందంగా కనిపించడానికి బంగారు రంగు పిన్నులను అమర్చారు. అయితే ఆ డిజైన్ నిలబడటానికి లోపల పెద్ద లోహపు తీగలను కత్తిరించి బేస్‌గా పెట్టారనే విషయం మాకు తెలియదు. బేకరీ వాళ్లు కూడా మాకు ఆ విషయాన్ని కనీసం చెప్పలేదు. ఆ రోజు రాత్రి ఆసుపత్రిలో మాకు జీవితంలో మర్చిపోలేని కాళరాత్రిలా గడిచింది. కేకుల అలంకరణ కోసం ఇటువంటి ప్రమాదకరమైన వస్తువులు వాడినప్పుడు బేకరీ యాజమాన్యం కస్టమర్లకు ముందే హెచ్చరికలు ఇవ్వాలి. తల్లిదండ్రులు కూడా పిల్లలకు కేక్ తినిపించే ముందు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి" అని ఆ తల్లి అందరినీ వేడుకుంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story