Mysuru: మంచం కింద చిరుత.. అత్త ప్రాణాలు కాపాడిన కోడలు!
Mysuru: మైసూరులో ఒళ్లు గగుర్పొడిచే ఘటన. నిద్రిస్తున్న అత్త మంచం కింద చిరుతపులి.. ప్రాణాలకు తెగించి అత్తను కాపాడిన కోడలు సుజాత.
Mysuru: మంచం కింద చిరుత.. అత్త ప్రాణాలు కాపాడిన కోడలు!
Mysuru: కర్ణాటకలోని సాంస్కృతిక రాజధాని మైసూరు నడిబొడ్డున అత్యంత ఉత్కంఠభరితమైన ఘటన చోటుచేసుకుంది. సిద్ధార్థనగరలోని ఒక నివాసంలోకి చొరబడిన చిరుతపులి, ఏకంగా ఒక వృద్ధురాలు నిద్రిస్తున్న మంచం కింద మాటువేసింది. అయితే కోడలు చూపిన అసాధారణ ధైర్యం వల్ల ఒక పెద్ద ప్రమాదం తప్పింది.
అసలేం జరిగిందంటే..
సిద్ధార్థనగర నివాసి సురేశ్ తల్లి శైలజ శుక్రవారం ఉదయం తన గదిలో నిద్రిస్తున్నారు. అదే సమయంలో ఆమె కోడలు సుజాత గదిలోకి వెళ్లగా, మంచం కింద ఏదో కదులుతున్నట్లు గమనించారు. తీరా చూస్తే అది చిరుతపులి అని తెలిసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆందోళన చెందినా ఏమాత్రం తత్తరపాటు చెందకుండా, అత్యంత నిశ్శబ్దంగా గదిలోకి వెళ్లి నిద్రిస్తున్న అత్తను అప్రమత్తం చేసి బయటకు తీసుకువచ్చారు.
వెంటనే ఆ గదికి గడియ పెట్టి, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన సిబ్బంది చిరుతకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి బంధించారు. ప్రాణాలకు తెగించి తన అత్తను కాపాడిన సుజాతను అటవీశాఖ అధికారులు మరియు స్థానికులు ఆకాశానికెత్తేస్తున్నారు. ఆమె సమయస్ఫూర్తి వల్లే ప్రాణనష్టం జరగలేదని ప్రశంసిస్తున్నారు.




