షాకింగ్ వీడియో.. పోలీస్ అధికారిపై విచక్షణారహితంగా పిడిగుద్దులు..
Nagpur: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో నడిరోడ్డుపై ఘోరం జరిగింది. రోడ్ రేజ్ వివాదంలో ఓ పోలీస్ అధికారిపై కొందరు యువకులు విచక్షణారహితంగా దాడి చేసి, పిడిగుద్దులు కురిపించారు.
షాకింగ్ వీడియో.. పోలీస్ అధికారిపై విచక్షణారహితంగా పిడిగుద్దులు..
Nagpur: మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నగరంలో శాంతిభద్రతల పరిస్థితిని ప్రశ్నించేలా ఓ షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సమాజానికి రక్షణగా నిలవాల్సిన ఒక పోలీస్ అధికారిపైనే కొందరు యువకులు నడిరోడ్డుపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. బైక్‌లపై వెంబడించి, కారును అడ్డగించి, సదరు అధికారిని పిడిగుద్దులతో ముంచెత్తారు. ప్రస్తుతం ఈ దారుణానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా హల్‌చల్ చేయడంతో నెటిజన్ల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
పోలీసుల వివరాల ప్రకారం.. ఒక పోలీస్ అధికారి (35) విధుల్లో లేని సమయంలో తన వ్యక్తిగత కారులో ఒక మహిళా స్నేహితురాలితో కలిసి మన్‌కాపూర్ చౌక్ వైపు వెళ్తున్నారు. ఆ సమయంలో మార్గమధ్యంలో వీరి కారు, నిందితుల ద్విచక్రవాహనం ఒకదానికొకటి స్వల్పంగా ఢీకొన్నాయి. ఈ చిన్న రోడ్ రేజ్ (Road Rage) ప్రమాదం కాస్తా ఇరువర్గాల మధ్య పెద్ద వివాదానికి దారితీసింది. బైక్‌లపై ఉన్న యువకులు ఒక్కసారిగా రెచ్చిపోయి సదరు అధికారి కారును అడ్డగించారు.
అనంతరం కారు అద్దాలను, బాడీని ధ్వంసం చేస్తూ లోపల ఉన్న పోలీస్ అధికారితో తీవ్ర వాగ్వాదానికి దిగారు. అంతటితో ఆగకుండా, ఆయన్ను బలవంతంగా కారులోంచి బయటకు లాగారు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే విచక్షణారహితంగా కొట్టుకుంటూ రోడ్డు అవతలి వైపునకు ఈడ్చుకెళ్లారు. ఆపై కిందపడేసి ముఖం, శరీరంపై పిడిగుద్దులు కురిపిస్తూ తీవ్రంగా గాయపరిచారు. అత్యంత దారుణమైన విషయమేమిటంటే.. ఈ ఘోరం జరుగుతున్నప్పుడు రోడ్డుపై పదుల సంఖ్యలో వాహనాలు వెళ్తున్నా, సదరు యువకులను నిలువరించేందుకు లేదా పోలీస్‌ను కాపాడేందుకు ఒక్కరు కూడా సాహసించలేదు. దాడి పూర్తి కాగానే నిందితులు బైక్‌లపై అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం స్పృహ కోల్పోయిన బాధితుడిని కొంతమంది స్థానికులు సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ఆయనకు అత్యవసర చికిత్స అందుతోంది.
ఈ అమానుష దాడి దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. వీటి ఆధారంగా మన్‌కాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ దాడికి పాల్పడిన రౌడీ మూకకు చెందిన 13 మంది నిందితులను గుర్తించి పోలీసులు చుట్టుముట్టారు.
అరెస్ట్ అయిన వారిలో హర్ష్ పవార్, గౌరవ్ ధిర్డే, సంయమ్ గణేశ్‌పురి, యాస్ ప్రతేకి, సత్యం షిర్కే, ప్రేమ్‌రాజ్ ధాకటే, ఆకాశ్ బోకాడే, నితిన్ గోఖలే, విక్కీ తెల్ఘారే, భూమి దేవ్ (అలియాస్ సాగర్ బోక్డే), గణేశ్ ఉయికే, ప్రీతమ్ మోడేకర్, మరియు టికారామ్ బరాపాత్రే ఉన్నారు. వీరిలో చాలా మందిపై ఇప్పటికే స్థానిక పోలీస్ స్టేషన్లలో పలు క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని అధికారులు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి దాడికి ఉపయోగించిన 5 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు, వీరిపై కఠిన సెక్షన్ల కింద చర్యలు తీసుకోనున్నట్లు నాగ్‌పూర్ పోలీసులు స్పష్టం చేశారు.




