Nagpur Cricketer : క్రికెట్ జట్టుకు ఎంపిక కాలేదని 17 ఏళ్ల క్రికెటర్ ఆత్మహత్య.!

Nagpur Cricketer : మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో క్రీడా లోకాన్ని, స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన విషాదకర సంఘటన వెలుగుచూసింది. భారత జాతీయ..

G Krishna
Published on: 31 July 2026 10:09 AM IST
nagpur woman cricketer suicide
X

nagpur woman cricketer suicide

Nagpur Cricketer : మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో క్రీడా లోకాన్ని, స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన విషాదకర సంఘటన వెలుగుచూసింది. భారత జాతీయ క్రికెట్ జట్టులో చోటు సంపాదించడమే లక్ష్యంగా కష్టపడుతున్న ఒక 17 ఏళ్ల మహిళా క్రికెటర్, తీవ్ర మానసిక ఒత్తిడికి తాళలేక ఆత్మహత్యకు పాల్పడింది. విదర్భ క్రికెట్ అసోసియేషన్ (VCA) ఇటీవల విడుదల చేసిన సెలక్షన్ జాబితాలో తన పేరు లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ బాలిక, నాగ్‌పూర్ లక్ష్మీనగర్‌లోని తన నివాసంలో బుధవారం ఉదయం ఫ్యాన్‌కు ఉరివేసుకుని తనువు చాలించింది.

నేను సెలెక్ట్ కాలేదు..కన్నీరు పెట్టించే సూసైడ్ నోట్

సంఘటనా స్థలానికి చేరుకున్న లక్ష్మీనగర్ పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టి, బాలిక రాసిన ఒక చేతిరాత సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో హిందీలో "మేరా సెలెక్షన్ నహీ హువా" (నేను ఎంపిక కాలేదు) అని రాసి ఉంది. రాత్రింబవళ్లు కష్టపడి శిక్షణ పొందినప్పటికీ విదర్భ క్రికెట్ జట్టు సెలక్షన్స్‌లో చోటు దక్కకపోవడం, తన పేరు జాబితాలో కనిపించకపోవడంతో ఆ బాలిక గత కొన్ని రోజులుగా తీవ్ర నిరాశలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు , పోలీసులు వెల్లడించారు. ఆ అపజయాన్ని తట్టుకోలేకనే ఈ దారుణమైన నిర్ణయానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.

క్రికెట్ కల నెరవేర్చుకోవడానికి నాగ్‌పూర్ వచ్చిన తల్లి, కుమార్తె

మహారాష్ట్రలోని అకోలా జిల్లాకు చెందిన ఈ బాలికకు చిన్ననాటి నుంచే క్రికెట్ అంటే విపరీతమైన ఆసక్తి. దేశవాళీ మ్యాచ్‌ల్లో, ఆపై అంతర్జాతీయ స్థాయిలో రాణించాలనేది ఆమె ఏకైక ఆశయం. ఈ కలను సాకారం చేసుకోవడం కోసమే గత రెండేళ్లుగా ఆమె తన తల్లితో కలిసి అకోలా నుంచి నాగ్‌పూర్‌కు మకాం మార్చింది. నాగ్‌పూర్‌లోని ఒక ప్రముఖ క్రికెట్ అకాడమీలో చేరి రోజూ గంటల తరబడి కఠినమైన శిక్షణ పొందుతోంది. విశేషమేమిటంటే ఆమె సోదరుడు కూడా క్రికెటర్ కావడంతో, ఇంట్లోనూ ఆమెకు క్రికెట్‌పై పూర్తి ప్రోత్సాహం లభించింది. ఎంతో శ్రమించి ఆడినా ఆశించిన ఫలితం దక్కకపోవడంతో ఆ చిన్నారి మనసు విరిగిపోయింది.

రంగంలోకి పోలీసులు.. కేసు నమోదు

సమాచారం అందుకున్న వెంటనే లక్ష్మీనగర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ప్రస్తుతం పోలీసులు ప్రమాదవశాత్తు మృతి (Accidental Death Report - ADR) కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్రికెట్ అకాడమీలోని శిక్షకులను, తోటి క్రీడాకారులను కూడా ప్రశ్నించి, ఆత్మహత్యకు గల పూర్తి కారణాలను విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, కానీ ఒక్క ఎంపికలో చోటు దక్కలేదని ఉజ్వల భవిష్యత్తు ఉన్న క్రీడాకారిణి ఇలా చిన్న వయసులోనే జీవితాన్ని ముగించడం స్థానికంగా , విదర్భ క్రీడా వర్గాల్లో తీవ్ర సానుభూతిని, విషాదాన్ని నింపింది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story