NALSAR Students : నాల్సార్ లా స్టూడెంట్స్‌కు సుప్రీం ఊరట.. బీసీఐకి సీజేఐ స్ట్రాంగ్ వార్నింగ్.!
NALSAR Students : హైదరాబాద్‌లోని ప్రముఖ నాల్సార్ (NALSAR) లా విశ్వవిద్యాలయ 2026 బ్యాచ్ గ్రాడ్యుయేట్ల ఎన్‌రోల్‌మెంట్‌ను నిలిపివేయాలంటూ బార్ కౌన్సిల్ ఆఫ్..
nalsar students supreme court relief
NALSAR Students : హైదరాబాద్‌లోని ప్రముఖ నాల్సార్ (NALSAR) లా విశ్వవిద్యాలయ 2026 బ్యాచ్ గ్రాడ్యుయేట్ల ఎన్‌రోల్‌మెంట్‌ను నిలిపివేయాలంటూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) జారీ చేసిన వివాదాస్పద ఆదేశాలపై భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్య కాంత్ మిశ్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనివర్సిటీ కాన్వొకేషన్‌కు ప్రధాన న్యాయమూర్తి హాజరుకావడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు విద్యార్థులు చేపట్టిన నిరసన ప్రచారాన్ని నెపంగా చూపి, విచారణ పూర్తయ్యే వరకు 2026 బ్యాచ్ విద్యార్థులెవరినీ ఏ రాష్ట్ర బార్ కౌన్సిల్‌లోనూ లాయర్లుగా ఎన్‌రోల్ చేయవద్దని బిసిఐ ఆదేశాలు జారీ చేసింది. ఈ విచిత్రమైన నిర్ణయంపై దాఖలైన పిటిషన్ అత్యవసరంగా విచారణకు రాగా, సీజేఐ స్పందిస్తూ విద్యార్థుల విషయంలో జోక్యం చేసుకోవడానికి బిసిఐ ఎవరంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు.
సీజేఐ సంచలన వ్యాఖ్యలు.. "విద్యార్థిగా నేను కూడా నిరసనలు చేశా"
ఈ వివాదాస్పద సర్క్యులర్‌ను తీవ్రంగా ఆక్షేపించిన ప్రధాన న్యాయమూర్తి, విద్యార్థుల హక్కులను కాలరాసేలా వ్యవహరించవద్దని హెచ్చరించారు. విద్యార్థిగా ఉన్న రోజుల్లో తాను కూడా పలు నిరసన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నానని ఈ సందర్భంగా సీజేఐ గుర్తుచేసుకున్నారు. ఇది తనకు, తన విద్యార్థులకు మధ్య నడిచే అంతర్గత చర్చ మాత్రమేనని, అందులో అనవసరంగా జోక్యం చేసుకోవడానికి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఏం హక్కు ఉందో అర్థం కావడం లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. నాల్సార్ విద్యార్థులు లేదా అధ్యాపకులపై ఎలాంటి క్రమశిక్షణ లేదా శిక్షాత్మక చర్యలు తీసుకోకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో, బిసిఐ వెంటనే ఆ వివాదాస్పద సర్క్యులర్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు కోర్టుకు తెలిపింది.
బార్ అసోసియేషన్ మండిపాటు..
నాల్సార్ విసి నుంచి నివేదిక కోరుతూ బిసిఐ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (SCBA) అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ కూడా తీవ్రంగా నిరసించారు. బిసిఐ చైర్మన్ మనన్ కుమార్ మిశ్రాకు లేఖ రాస్తూ, ఈ నిర్ణయాన్ని చట్టవిరుద్ధమైనదిగా, రాజ్యాంగ విరుద్ధమైనదిగా అభివర్ణించారు. విశ్వవిద్యాలయాలు నిర్భయమైన ఆలోచనలకు, ఆరోగ్యకరమైన చర్చలకు వేదికలని, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నవారితో విభేదించినంత మాత్రాన న్యాయవాద వృత్తిలోకి రాకుండా అడ్డుకుంటామని బెదిరించడం విద్యార్థుల ప్రాథమిక హక్కులను కాలరాయడమేనని స్పష్టం చేశారు.
వెనక్కి తగ్గిన బిసిఐ.. ఊపిరి పీల్చుకున్న విద్యార్థులు
సుప్రీంకోర్టు కఠిన వ్యాఖ్యలు, సీజేఐ మద్దతుతో నాల్సార్ లా విద్యార్థులకు పెద్ద ఊరట లభించింది. సర్క్యులర్ జారీ చేసిన కొద్ది గంటల్లోనే బిసిఐ దిగిరావడం గమనార్హం. 2026 బ్యాచ్‌లోని మెజారిటీ విద్యార్థులు అమాయకులని, సీజేఐని అవమానించే ఉద్దేశం వారికి లేదని తమ తాజా సమాచారం ద్వారా వ్యక్తమవుతోందని చెబుతూ బిసిఐ ఆ ఆదేశాలను ఉపసంహరించుకుంది. దీంతో గ్రాడ్యుయేట్ కాబోతున్న వందలాది మంది న్యాయ విద్యార్థుల భవిష్యత్తుపై నెలకొన్న ఆందోళనల మబ్బులు తొలగిపోయాయి.




