Army Jawan Death : నార్సింగిలో కారు బీభత్సం.. రాంగ్ రూట్‌లో వచ్చి ఢీ.. ఆర్మీ జవాన్ మృతి..
Army Jawan Death : హైదరాబాద్ నగర శివారులోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదర్ షాకోట్ ప్రాంతంలో తీవ్ర మత్తులో ఉన్న...
Accident
Army Jawan Death : హైదరాబాద్ నగర శివారులోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదర్ షాకోట్ ప్రాంతంలో తీవ్ర మత్తులో ఉన్న కొందరు యువకులు నడిపిన మహేంద్ర XUV కారు రాంగ్ రూట్‌లో అత్యంత వేగంగా దూసుకొచ్చి బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఒక ఆర్మీ జవాన్ అక్కడికక్కడే మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
రాంగ్ రూట్‌లో వేగం.. ఆర్మీ జవాన్ బలి
హైదర్ షాకోట్ వీధుల్లో రాంగ్ రూట్‌లో మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన కారు, ముందుగా రోడ్డుపై వెళ్తున్న ఆర్మీ జవాన్‌ను బలంగా ఢీకొట్టింది. కారు తాకిడికి తీవ్రంగా గాయపడిన సదరు సైనికుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం జరిగింది అని తెలిసినప్పటికీ కారును నిలపకుండా డ్రైవర్ అక్కడి నుంచి వేగంగా పరారయ్యేందుకు ప్రయత్నించాడు. ఆ క్రమంలోనే కారు మరో నలుగురిని ఢీకొట్టడంతో వారికీ తీవ్ర గాయాలయ్యాయి.
మత్తులో ఐదుగురు యువకులు.. ముగ్గురికి తీవ్ర గాయాలు
ప్రమాదానికి కారణమైన కారు శంషాబాద్ ఎయిర్‌పోర్టు ప్రాంతానికి చెందిన బాబు గౌడ్ అనే వ్యక్తికి చెందినదిగా అధికారులు గుర్తించారు. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు యువకులు ఉన్నారని, వారంతా మద్యం మత్తులో తూలుతూ అడ్డగోలుగా వాహనాన్ని నడిపినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, వారిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది.
కేసు నమోదు.. దర్యాప్తు వేగవంతం
సమాచారం అందుకున్న వెంటనే నార్సింగి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతిచెందిన ఆర్మీ జవాన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ప్రమాదానికి కారణమై పరారైన కారును, దానిలో ఉన్న యువకులను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.




